అమరావతికి రాజధానిగా చట్టబద్ధత..28న ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి రాష్ట్ర రాజధానిగా శాశ్వత చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.

By -  Knakam Karthik
Published on : 26 March 2026 6:18 AM IST

Andrapradesh, Amaravati, AP Capital, AP Assembly, Central Gazette, AP Reorganisation Act

అమరావతికి రాజధానిగా చట్టబద్ధత..28న ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి రాష్ట్ర రాజధానిగా శాశ్వత చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది. ఈ క్రమంలో మార్చి 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ ఈ సమావేశంలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి, తదుపరి చర్యల కోసం దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 5(2)ను సవరించడం ద్వారా, గతంలో ఉన్న "కొత్త రాజధాని" అనే సాధారణ పదం స్థానంలో "అమరావతి"ని స్పష్టంగా చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలాంటి చట్టపరమైన వివాదాలు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ లభిస్తుంది. ఇప్పటికే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఈ సవరణకు ప్రాథమికంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.

గతంలో 2014-19 మధ్య కాలంలో సుమారు 34,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించి అమరావతి నిర్మాణానికి పునాది వేశారు. అయితే 2019లో అధికార మార్పిడి తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనతో ఈ ప్రాజెక్టు ఐదేళ్ల పాటు అనిశ్చితిలో పడింది. 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం తుళ్ళూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల్లో రెండో దశ భూ సమీకరణకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతికి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపుతో పాటు చట్టపరమైన స్థిరత్వం లభించనుంది.

Next Story