టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే ఈ పిటిషన్‌ను కొట్టివేసిందని తెలిపింది. ఎవరి ఆస్తులు ఎవరికి తెలియాలని కోర్టు ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశానికి విలువ లేదంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు. తాను చంద్రబాబుపై తుదివరకు పోరాడానని, అవినీతిపరుడు చంద్రబాబును ఇక కాలమే శిక్షించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఒక్కో కోర్టు ఒక్కో విధంగా తీర్పునిస్తోందని, ఒక్కో మనిషికి ఒక్కో న్యాయమా? అని ఆమె వాపోయారు. "మరొకరి ఆస్తులపై ప్రశ్నించడానికి మీరెవరు? అంటూ సుప్రీంకోర్టు నన్ను ప్రశ్నించింది. మరి జగన్ ఆస్తులపై ప్రశ్నించడానికి శంకర్ రావు ఎవరు? టీడీపీ నేతలకు ఏం పని? 2జీ స్పెక్ట్రమ్ కు సంబంధించిన కేసులో సుబ్రహ్మణ్యం ఎవరు? కోర్టు ఈ అంశాలను కూడా పరిగణించి నా పిటిషన్ పై తీర్పునిస్తే బాగుండేది" అని లక్ష్మీపార్వతి అన్నారు.