స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.
చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు.. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలని.. ఐదు వారాల పాటు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారన్నారు. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అంతేకాకుండా 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలని వైద్యులు సూచించారు. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. గుండె పరిమాణం పెరిగిందన్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయని తెలిపారు. చంద్రబాబుకు మధుమేహం అదుపులో ఉందని.. తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు.