భూ దందాలు చేస్తే సహించేది లేదు : పవన్ కళ్యాణ్

ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించే విధంగా చర్యలు ఉంటాయ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

By Medi Samrat
Published on : 18 April 2025 8:30 PM IST

భూ దందాలు చేస్తే సహించేది లేదు : పవన్ కళ్యాణ్

‘కష్టపడి సంపాదించుకున్న చిన్నపాటి జాగాలు కావచ్చు, వారసత్వంగా వచ్చిన భూములు కావచ్చు.. వాటిని కాపాడుకోవడం కోసం సామాన్యులుపడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ప్రజల ఆస్తులకు కూటమి పాలనలో భరోసా కల్పించే విధంగా చర్యలు ఉంటాయ’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భూ దందాలు చేసినా, తప్పుడు దస్తావేజులు సృష్టించినా, కబ్జాలకు పాల్పడ్డా సహించేది లేదనే విషయాన్ని ఆ నేరాలకు పాల్పడేవారికి కఠినంగా తెలియచేయబోతున్నామని చెప్పారు. కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి భూ కబ్జాలు, తప్పుడు రెవెన్యూ రికార్డుల ద్వారా ఆక్రమణలు చేస్తున్న విషయంపై పలు అర్జీలు వస్తున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప ప్రాంతాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయ అధికారులతో ఉప ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో పాలక పక్షానికి చెందినవారు చేసిన భూ దందాలు, ఆస్తులకు కోసం చేసిన బెదిరింపుల గురించీ, కూటమి పక్షాల పేరుతో ఆక్రమణలు చేసి వేధిస్తున్నవారి గురించీ ఫిర్యాదులు అందాయి. ప్రజల ఆస్తులతోపాటు ప్రభుత్వ ఆస్తులను కబ్జాపెడుతున్న విషయాలను ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపారు. కాకినాడ జిల్లా పరిధిలో గత పాలక పక్షానికి చెందిన నాయకుడు, అతని అనుచరులు బ్రాహ్మణుల ఆస్తులతోపాటు సత్రం భూములు, ఎండోమెంట్ ఆస్తులను కబ్జా చేయడం, కాకినాడ నగరంలో వ్యాపారులకు సంబంధించిన భవనాల స్వాధీనం కోసం బెదిరింపులకు దిగిన వైనాలు, తిరుపతి నగరంలో మఠం భూములను ఆక్రమించి గేట్లుపెట్టుకోవడం లాంటి అంశాలు ఈ ఫిర్యాదుల్లో ఉన్నాయి. విశాఖ నగర శివార్లు, పారిశ్రామిక విస్తరణ ఉన్న ప్రాంతాల్లోని భూముల విషయంలో వివాదాలు సృష్టించడాన్ని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు.

ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేషీ అధికారులతో మాట్లాడుతూ “ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ ఇస్తుంది. గత పాలకులు ప్రజల ఆస్తులను వివాదాల్లోకి నెట్టి.. కబ్జాల చేసేలా చట్టాలే చేశారు. వారి మద్దతుతో కొందరు దందాలు సాగించారు. ఆ తరహా అక్రమాలు చేసేవారిపై కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. ప్రజల నుంచి ఇప్పటికీ అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. నేనే స్వయంగా జిల్లా కేంద్రాలకు వెళ్ళి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల సమక్షంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి బాధలు తెలుసుకొని, భరోసా ఇస్తాను. తొలుత కాకినాడ, విశాఖపట్నం వెళ్తాను. ఆయా ప్రాంతాలలో భూ దందా బాధితులతో మాట్లాడతాను. వారి ఫిర్యాదులపై పరిశీలన చేస్తాను. వారు కూటమి నేతల మూలంగా ఇబ్బందిపడ్డా.. ఉపేక్షించబోము. కారకులపై చర్యలు తీసుకొంటాము. కూటమి ప్రభుత్వ పాలన పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగుతుంది. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులతో చర్చిద్దాము. ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను వారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రక్రియ చేపట్టాలి” అన్నారు.

Next Story