ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కొడుకు, కోడలు సహా తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ లపై లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఎన్టీఆర్ పార్టీలోకి వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుందని లక్ష్మీపార్వతి బదులిచ్చారు. తనకు తెలిసినంత వరకు ఎన్టీఆర్ టీడీపీలోకి రావడంలేదని అన్నారు. ఎన్నికల ముందు వీళ్లు చాలా అబద్ధాలు సృష్టిస్తుంటారని, అందులో ఇది కూడా ఒకటని అన్నారు.
లోకేశ్ నాయకత్వాన్ని సమర్థించడానికి ఎన్టీఆర్ సిద్ధంగా లేరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. ఒకవేళ పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎన్టీఆర్ పార్టీలోకి వస్తాడని భావిస్తున్నానని తెలిపారు. నారా లోకేష్‌కు తెలుగు దేశం పార్టీ నాయకత్వం అప్పగించేందుకు జూ.ఎన్టీఆర్ సిద్ధంగా లేరని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం.. తప్పకుండా ఆయన టీడీపీలోకి వస్తారని వెల్లడించారు. ఇంతకుమించి తానేం మాట్లాడలేనని, ఎన్టీఆర్ టీడీపీలోకి అడుగుపెట్టాక తాను స్పందిస్తానని చెప్పారు.