నేనే కూల్చేస్తాను.. కేవీపీ క్లారిటీగా ఉన్నారే..!

తన ఫామ్‌హౌస్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) పరిధిలో ఉన్నట్లు తేలితే కూల్చివేయాలని.. లేదా తానే కూల్చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.

By Medi Samrat  Published on  4 Oct 2024 3:45 PM IST
నేనే కూల్చేస్తాను.. కేవీపీ క్లారిటీగా ఉన్నారే..!

తన ఫామ్‌హౌస్ ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) పరిధిలో ఉన్నట్లు తేలితే కూల్చివేయాలని.. లేదా తానే కూల్చేస్తానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ సీఎంకు రాసిన బహిరంగ లేఖలో తన అజీజ్ నగర్ ఇల్లు ఎఫ్‌టిఎల్ లేదా బఫర్ జోన్‌లో లేదని తన కుటుంబం ధృవీకరించినట్లు రామచంద్రరావు చెప్పారు. ఒక వేళ ఉంటే తాను స్వచ్ఛందంగా కూల్చివేయడానికి సిద్ధంగా ఉండడమే కాకుండా శిథిలాలను కూడా తొలగిస్తానని కేవీపీ తెలిపారు.

"మీ నాయకత్వంలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి చెడ్డపేరు తేవడానికి నాలో నరనరాన ఉన్న కాంగ్రెస్ రక్తం అంగీకరించనందుననే మీకు ఈ బహిరంగ లేఖ." అంటూ కేవీపీ సోషల్ మీడియాలో లేఖను పోస్టు చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీపై, మన పార్టీపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడానికి ప్రతిపక్షాలు నన్ను, నా కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఫాం హౌస్ ను పావుగా వాడుకుంటూ ఉండడం తీవ్ర మనోవేదన కలిగిస్తుందని రామచంద్రరావు అన్నారు. సంబంధిత అధికారులను వీలు చేసుకొని వెంటనే మా ఫాం హౌస్ కు పంపించాలని కోరారు. చట్ట ప్రకారం అక్కడ ఎఫ్‌టి‌ఎల్, బఫర్ జోన్ల పరిధిని మార్క్ చేస్తే ఆ పరిధిలో ఏదైనా కట్టడం ఉంటే.. 48 గంటలలో ప్రభుత్వానికి భారం కాకుండా సొంత ఖర్చులతో ఆ కట్టడాలను కూలుస్తామన్నారు కేవీపీ రామచంద్రరావు.

Next Story