కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌కు కూడా ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్, కేంద్రమంత్రితో కలిసి‌‌ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్‌ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ విమానాశ్రయానికి పెట్టిన పేరు కూడా ఆసక్తికరంగా మారింది. ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని.. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేది. ఇక నుండి విమాన ప్రయాణం కూడా జరగబోతోంది. రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయమని అన్నారు. ఈ నెల 28 నుంచి విమానాశ్ర‌యంలో రాక‌పోక‌లు జ‌రుగుతాయ‌న్నారు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్య‌మం చేశార‌ని, ఆయ‌నకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా జగన్ ప్ర‌క‌టించారు.

ఇక ఇదే వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద కూడా విమర్శలు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బాబు గ‌తంలో ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారని.. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారని విమ‌ర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశామని జ‌గ‌న్ చెప్పారు. 110 కోట్ల రూపాయ‌ల‌ ఖర్చుతో అన్ని నిర్మాణాలను పూర్తి చేసి ఏడాదిన్నరలోనే విమానాశ్రయాన్ని ప్రారంభించామని అన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలను తీసుకొచ్చామని తెలిపారు.


సామ్రాట్

Next Story