కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం విశాఖకు తరలివెళ్తుందని.. అందులో మరో ఆలోచనే లేదని ఏపీ జలవనరులశాఖ ఇంజనీర్-ఇన్-ఛీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే నేతృత్వంలో త్రిసభ్య కమిటీ సమావేశం.. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు జరిగింది. రాష్ట్రం తరపున ఈఎన్సీ నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నాగార్జునసాగర్ సీఈ నర్సింహ పాల్గొన్నారు.
మార్చి నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, విడుదలపై సమావేశంలో చర్చించారు. సాగర్ ఎడమ కాల్వలో నీటి నష్టాలు, మరుసటి ఏడాదికి మిగులు జలాల బదలాయింపు, వరద సమయాల్లో నీటి వినియోగం లెక్కించరాదన్న అంశాలు చర్చకు వచ్చాయి.
108 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ, 80 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ.. కృష్ణా బోర్డుకు ఇప్పటికే వినతులు సమర్పించాయి. శ్రీశైలంలో 810, సాగర్లో 520 అడుగుల దిగువకు నీరు తీసుకోరాదని.. 95 టీఎంసీలలోపు స్వీకరించేందుకు మరోసారి వినతి సమర్పించాలని తెలంగాణ అధికారులు ఏపీకి తెలిపారు. సవరించిన లెక్కలతో రాష్ట్రం నుంచి మరోమారు వినతి వచ్చిన అనంతరం.. రెండు జలాశయాల్లోని మట్టాల ఆధారంగా నీటివిడుదల ఉత్తర్వులను బోర్డు జారీ చేయనుంది.