గణేష్ చతుర్థి పండుగను రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెడు ఆలోచనలతో దేవుడితో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో వినాయక చతుర్థి వేడుకలపై ప్రత్యేక ఆంక్షలు లేవని మరోసారి స్పష్టం చేసిన ఆయన.. కొత్త నిబంధనలేవీ అమలు కానందున నిబంధనల ప్రకారం వినాయక చతుర్థి వేడుకలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదన్నారు.
వినాయక చతుర్థి ఉత్సవాలకు ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదనితెలిపారు. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా ఎక్కడా వేడుకలు సక్రమంగా నిర్వహించలేదని మంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాది పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చారు. రాజకీయాలు చేస్తూ విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. వినాయక చతుర్థి ఉత్సవాలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎండోమెంట్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు.