హిందూ దేవాలయాలకు పేటెంట్ నాదే అన్నట్లు సోము వీర్రాజు మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 8 ప్రధాన అలయాలతో పాటు 32 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. 20 లక్షలు దాటిన ఆలయాలు EAF కింద ప్రభుత్వానికి నిధులు ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని ఆలయాల నుంచి వచ్చే నిధులు సీజీఎఫ్ కింద జమ చేస్తామని తెలిపారు. 44 ఆలయాలు కూలగొట్టినప్పుడు సోము వీర్రాజు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మీ పార్టీ వారు మంత్రిగా ఉన్నప్పుడే ఆలయాలు కూల్చివేశారని గుర్తుచేశారు.
ఏ ఒక్క ఆలయం నుంచి కూడా ఒక్క డిపాజిట్ నుంచి డబ్బులు తీసుకోలేదని.. కావాలని బురద జల్లేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. దేవాదాయ శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళలేదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఘాట్ రోడ్డు దర్శనాలు నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ప్రజలు ఎవరిని నమ్మితే ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. పవన్ కు రాజకీయ సిద్ధాంతాలు లేవని విమర్శించారు. పవన్ ముందు టీడీపీపై పోరాటం చేయాలని.. చంద్రబాబుకు మద్దతు ఇచ్చి పవన్ చాలా నష్టపోయారని.. ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగితే తర్వాత రాజకీయాలు చేయవచ్చని సూచించారు.