కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. ఎందుకంటే.?
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కోట వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
By Medi Samrat
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కోట వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతి కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కోట వినుతను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. కోట వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకు భిన్నంగా ఉందని, గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్లు జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమెపై చెన్నైలో హత్య కేసు నమోదు అయిన విషయం పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జనసేన అధిష్ఠానం ప్రకటించింది.
సుమారు రెండు వారాల క్రితం డ్రైవర్ రాయుడిని వినుత విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత చెన్నైలోని కూవం నదిలో మూడు రోజుల క్రితం గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడి చేతిపై జనసేన గుర్తు, వినుత పేరు ఉండడంతో దర్యాప్తును వేగవంతం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు, రాయుడును చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ కేసులో వినుత, ఆమె భర్త, మరో ముగ్గురు నిందితులుగా తేలింది. ఈ కేసులో కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.