పోలీసుల అదుపులో మాజీమంత్రి కొల్లు రవీంద్ర

Kollu Raveendra Arrest. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు

By Medi Samrat  Published on  30 July 2021 8:37 PM IST
పోలీసుల అదుపులో మాజీమంత్రి కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ పరిశీలనకు టీడీపీ నిజనిర్థారణ కమిటీ రేపు వెళ్ల‌నుంది. దీంతో రేపు కొండపల్లి వెళ్లకుండా కొల్లు రవీంద్రను ముందస్తు గృహ నిర్భంధం చేశారు పోలీసులు. ఈ నేఫ‌థ్యంలో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్నారని అన్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరగకపోతే ఎందుకు టీడీపీ నేతల పర్యటనను అడ్డుకుంటున్నారు ? అని ప్ర‌శ్నించారు.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతుంది.. అది బయటపడుతుందనే మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడికి దిగారని.. దేవినేని ఉమ కారుపై వైసీపీ నాయకులు దాడి చేస్తే.. తిరిగి దేవినేని ఉమాపై కేసు పెట్టడం ఏంటి అని నిల‌దీశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి మైనింగ్ చేసే అవసరం లేదని చిలకపలుకులు పలికిన మంత్రులు.. మా హౌస్ అరెస్ట్ కి ఏం సమాధానం చెబుతారని మండిప‌డ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టీడీపీ నాయకుల మైనింగ్ పరిశీలనకు అంగీకరించాలని అన్నారు. పోలీసులను ఉపయోగించి ప్రశ్నించే గొంతును నొక్కాల‌ని చూస్తున్నారని.. పోలీసులు ఎన్ని నిర్బందాలు పెట్టినా.. రేపు కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి వెళ్లి తిరుతామ‌ని స్ప‌ష్టం చేశారు.


Next Story