దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయించండి
Kodali Nani Fire On Chandrababu. మాజీమంత్రి కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి
By Medi Samrat Published on 29 July 2022 8:00 PM IST
మాజీమంత్రి కొడాలి నాని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలోనే అత్యంత పిరికి సన్నాసి చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గుడివాడ లో మాట్లాడుతూ చంద్రబాబు జీవితంలో ఏనాడైనా రాజీనామా చేశారా ? అని ప్రశ్నించాడు. కనీసం సర్పంచ్‌తో కూడా రాజీనామా చేయించలేని వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అవతలవారికి చెప్పే ముందు.. నీ దగ్గరున్న 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలతో రాజీనామా చేయించాలని అన్నారు. రాజీనామాలను ఈక ముక్కతో సమానంగా విసిరేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ఎన్నికలంటే పారిపోయే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
వైఎస్ జగన్ పార్టీ పెట్టినపుడు ఎంపీ పదవికి రాజీనామా చేశారని.. 18 మందితో రాజీనామా చేయించి 15 మందిని గెలిపించుకున్న వ్యక్తి జగన్ అని కొడాలి నాని అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే కేసినో వ్యవహారంలో ఈడీ దాడుల ద్వారా తనను అరెస్ట్ చేయించాలని కొడాలి నాని సవాల్ చేశారు. మోకాలికి బోడిగుండుకు లంకె పెట్టినట్లు టీడీపీ బ్యాచ్ చీకోటిపై దాడుల వ్యవహారాన్ని తనకు ఆపాదించే ప్రయత్నం చేస్తోందని అన్నారు. నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలని.. దేశంలో ఏమి జరిగినా దానిని చంద్రబాబు భజన బృందం జగన్‌కు ముడిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.