NHAIని మోసం చేసిన మేకపాటి కుటుంబానికి చెందిన KMC కంపెనీ.?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి చెందిన నిధులను దుర్వినియోగం చేశారని...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2023 4:00 PM GMT
NHAIని మోసం చేసిన మేకపాటి కుటుంబానికి చెందిన KMC కంపెనీ.?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి చెందిన నిధులను దుర్వినియోగం చేశారని హైదరాబాద్‌కు చెందిన కృష్ణమోహన్ కన్‌స్ట్రక్షన్ (KMC) లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేసు నమోదు చేశారు. కేఎంసీ దివంగత వైఎస్సార్‌సీపీ మంత్రి గౌతంరెడ్డి కుటుంబానికి చెందినది. కంపెనీ డైరెక్టర్లుగా మేకపాటి పృథ్వీ కుమార్ రెడ్డి , షుజాత్ గౌసుద్దీన్ ఖాన్, మేకపాటి శ్రీ కీర్తి, ఆముదాల శ్రీరాములు నాగేశ్వర్ రావు ఉన్నారు.

NHAI నిధుల దుర్వినియోగం కేసులో ఈడీ అక్టోబర్ 16న కోల్‌కతాలోని భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (BRNL), గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (GIPL) కార్యాలయాలు, హైదరాబాద్‌లోని KMC కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ మరియు త్రిసూర్‌లోని GIPL కార్యాలయాలపై దాడులు చేసింది. గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జిఐపిఎల్) ఇతరులపై ఐపిసి, 1860, అవినీతి నిరోధక చట్టం, 1988లోని వివిధ సెక్షన్‌ల కింద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై ఈడీ చర్యలు మొదలుపెట్టింది తీసుకుంటోంది.

2006 నుంచి 2016 మధ్య జాతీయ రహదారి 47లోని రెండు విభాగాలకు సంబంధించిన పనుల నిర్వహణకు సంబంధించి కంపెనీ అప్పటి డైరెక్టర్‌ విక్రమ్‌రెడ్డి.. పాలక్కాడ్‌లోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని.. ఎన్‌హెచ్‌ఏఐని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. భారత ప్రభుత్వానికి సుమారు రూ. 102.44 కోట్లు నష్టం చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. GIPL, సబ్-కాంట్రాక్టర్ KMC కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, NHAI అధికారుల నుండి మోసపూరితంగా రహదారి ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తీ చేశామనే ధృవీకరణ పత్రాన్ని పొంది, ప్రజల నుండి టోల్ వసూలు చేశారని విచారణలో తేలింది.

బస్‌బేల నిర్మాణాన్ని పూర్తి చేయకుండానే సదరు కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ స్థలాన్ని లీజుకు తీసుకుని అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించినట్లు విచారణలో తేలింది. నిందితులు PMLA, 2002 ప్రకారం పనులు పూర్తీ చేయకుండానే రూ. 125.21 కోట్ల ప్రయోజనాలు పొందారు.

పత్రాలు దొరికాయి :

GIPL టోల్ వసూళ్లను NHAIకి చెల్లించకుండానే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్లు కనుగొన్నారు. అందువల్ల, కోల్‌కతాలోని గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వ్యతిరేకంగా రూ. 125.21 కోట్ల విలువకు PMLA, 2002లోని సెక్షన్ 17(1-A) కింద ఫ్రీజింగ్ ఆర్డర్ జారీ చేశారు. సోదాల సమయంలో KMC కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కార్యాలయం నుండి నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.

Next Story