ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా చేసిన రైతు రైలు

రైతుల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు రైలు(KISAN RaiL) సేవలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవంతంగా కొనసాగుతున్నాయి.

By Medi Samrat
Published on : 6 Aug 2025 4:33 PM IST

ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా చేసిన రైతు రైలు

రైతుల ప్రయోజనార్థం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రైతు రైలు(KISAN RaiL) సేవలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవంతంగా కొనసాగుతున్నాయి. 2020 ఆగస్టు 7 నుంచి ప్రారంభ‌మైన రైతు రైలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 116 సార్లు అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, త్రిపుర రాష్ట్రాల వైపు నడిచాయి. ఈ ప్రయాణాల ద్వారా ఇప్పటి వరకు 34,196 టన్నుల తాజా సరకు — ప్రధానంగా అరటిపండ్లు, మామిడిపండ్లు, ఉల్లిపాయలు వంటి పంటలు తరలించబడ్డాయని కేంద్ర రైల్వే శాఖ‌ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్ల‌డించారు.

లోక్ స‌భ‌లో బుధ‌వారం ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎంపీ ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద రావు, ఎంపీ లావు కృష్ణ దేవ‌రాయులు క‌లిసి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రైతు రైలు సేవ‌ల‌పై కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ‌ను ప్ర‌శ్నించ‌గా, కేంద్ర రైల్వే శాఖ‌ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు.

కూరగాయలు, పండ్లు ఉత్పత్తి చేసే జిల్లాలను రైతు రైలు సర్క్యూట్‌లో చేర్చడానికి రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖలతో పాటు స్థానిక మార్కెట్ యార్డులు, మండీలతో సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్ తెలిపారు. డిమాండ్ ఉన్న ప్రదేశాలను గుర్తించి, రవాణా సాధ్యాసాధ్యాలను పరిశీలించి సేవలు ప్రణాళిక చేస్తున్నామని వివరించారు. అయితే భవిష్యత్తులో రైతుల అవసరాలను బట్టి కొత్త సర్క్యూట్‌లలో కూడా రైతు రైలు సేవలు విస్తరించే అవకాశముందని మంత్రి స్పష్టం చేశారు. రైతు రైలు సేవలకు మద్దతుగా కూలింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోల (ICDs) నుండి మొత్తం 637 శీతలీకృత కంటైనర్లు కంటైనర్ కార్పొరేషన్ (CONCOR) ద్వారా నడపబడ్డయ‌న్నారు.. వీటిలో తాడిపత్రి నుండి 524, విశాఖపట్నం నుండి 113 కంటైనర్లు ఉన్నాయని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణ‌వ్ వివ‌రించారు.

Next Story