AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలివే..!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.

By -  Knakam Karthik
Published on : 10 April 2026 5:48 PM IST

Andrapradesh, AP Cabinet, CM Chandrababu, AI Data Center, QuantumValley, Semi conductor

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలివే..!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి కేంద్రాలుగా అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులకు పెద్దపీట వేశారు. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించిన ప్రధానాంశాలు ఇవే:

సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్

విశాఖపట్నంను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అదానీ ఇన్‌ఫ్రా AI డేటా సెంటర్, క్రెడెన్స్ రియల్టీ ఐటీ పార్క్ (రూ. 386 కోట్లు), ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ (రూ. 425 కోట్లు) ప్రాజెక్టులకు భూమి కేటాయింపులు మరియు ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. శ్రీ సత్య సాయి జిల్లాలో రూ. 10,239 కోట్లతో RRP ఎలక్ట్రానిక్స్ వారి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్‌కు ఆమోదం తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇన్నోవేషన్ హబ్ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ సౌకర్యాల కోసం C-DAC మరియు ఇతర సంస్థలకు అనుమతులు ఇచ్చారు. కుప్పంలో రూ. 2,550 కోట్లతో లిథియం బ్యాటరీ మెటీరియల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పరిశ్రమలు & వాణిజ్యం

నాయుడుపేటలో మెట్రో డెకోరేటివ్ సంస్థ MDF యూనిట్ (రూ. 1,032 కోట్లు), నెల్లూరులో శ్యామ్ మెటాలిక్స్ స్టీల్ కాంప్లెక్స్ (రూ. 3,678 కోట్లు), మరియు విశాఖలో ఆర్సెలర్ మిట్టల్ పెల్లెట్ ప్లాంట్ విస్తరణ (రూ. 1,400 కోట్లు) వంటి భారీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలో అనడ్రోన్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారు. ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఇండస్ కాఫీ మరియు రెడ్‌బెర్రీ ఫుడ్ లాజిస్టిక్స్ ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించారు.

యువజన, పర్యాటకం & సాంస్కృతిక శాఖ

రాష్ట్రంలో వారసత్వ సంపదను కాపాడేందుకు 'అడాప్ట్ ఎ మాన్యుమెంట్' పాలసీకి ఆమోదం తెలిపారు. విశాఖలో పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ గడువును 2027 వరకు పొడిగించారు. భోగాపురంలో 'అవని' బ్రాండ్ 5-స్టార్ రిసార్ట్, ఒంగోలులో 'రాడిసన్' హోటల్ వంటి పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు.

వ్యవసాయం & జలవనరులు

విజయవాడలోని రైతు బజార్‌ను పీపీపీ పద్ధతిలో అత్యాధునిక 'పుష్పాల మార్కెట్'గా మార్చాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో రూ. 679 కోట్లతో అల్తూరుపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సవరించిన అనుమతులు మంజూరు చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా ఇంజనీర్లకు అడ్-హాక్ పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు.

రెవెన్యూ మరియు ఇంధన శాఖ

ULC భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువును 2026 చివరి వరకు పొడిగించడమే కాకుండా, పట్టా మంజూరైన 2 ఏళ్లకే అన్యాక్రాంత హక్కులు కల్పించేలా నిబంధనలు సవరించారు. ఇంధన రంగంలో గ్రీన్ హైడ్రోజన్, బయోమాస్ మరియు సోలార్ పవర్ ప్రాజెక్టుల స్థాపనకు పలు ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు విధివిధానాలు ఖరారు చేశారు.

Next Story