ఆరోగ్యశ్రీ విషయంలో కీలక మార్పులు
Key Changes In Aarogyasri Scheme. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
By Medi Samrat
ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తాజాగా వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను 3,255కి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మే 2019లో ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్య కేవలం 1,059గానే ఉండగా.. ఆ చికిత్సలను క్రమంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అయితే ఇదే అంశాలన్ని మరోసారి పెంచుతూ.. జనవరి 2020లో 2059కి తీసుకొచ్చారు. అంతేకాదు వైద్యం ఖర్చుల కింద రూ.1000 పైబడ్డ చికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. జులై 2020లో 2200కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం ద్వారా అదనంగా చేర్చిన చికిత్సల్లో 54 క్యాన్సర్ చికిత్స ప్రొసీజర్లు తెచ్చింది. నవంబర్ 2020లో ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే రోగాల సంఖ్య 2,436కు పెంచారు. ఇందులో బోన్ మ్యారోతో పాటు 235 ప్రొసీజర్లను చేర్చారు. మే-జూన్ 2021లో 2,446కు ఆరోగ్యశ్రీ చికిత్సల సంఖ్య పెరగగా.. 10 కోవిడ్ ప్రొసీజర్లను కూడా ఆరోగ్య శ్రీలో చేర్చారు. 2022లో ఆరోగ్యశ్రీ కిందకు వచ్చే వ్యాదుల సంఖ్యను 3,255కు పెంచారు. ఆరోగ్యశ్రీకి ఎక్కడా బకాయిలు లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. ఎంపానెల్డ్ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగిందని చెప్పారు. 104 కాల్ సెంటర్ ద్వారా కూడా ఆరోగ్యశ్రీ రిఫరల్ సర్వీసులను అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అన్ని సేవల వివరాలను ఎంపానల్డ్, విలేజ్ క్లినిక్స్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.