ఫ్యామిలీ జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి..!

Kethireddy Pedda Reddy warns JC Prabhakar Reddy, says will not tolerate atrocities against his family. ఫ్యామిలీ జోలికి

By Medi Samrat  Published on  29 Dec 2020 12:37 PM GMT
ఫ్యామిలీ జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి..!

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్యాక్షన్ పడగ విప్పే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బహిరంగ వార్నింగ్ లు.. రోడ్డు మీదనే కొట్లాటలతో పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఘటనలతో తాడిపత్రి అట్టుడుకుతూ ఉండగా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన కుటుంబం జోలికి రావద్దంటూ జేసీ వర్గానికి వార్నింగ్ ఇస్తున్నారు. తమ కుటుంబం జోలికి వస్తే ఎంతటివారినైనా సహించేది లేదని పెద్దారెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. గతంలో కూడా తన కుమారులను బెదిరిస్తూ చానల్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారని, ఇలాంటి వాటికి తాను భయపడేది లేదన్నారు.

తాడిపత్రి నియోజకవర్గంలో ప్రజలు శాంతియుతంగా జీవనం గడపాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రెచ్చగొట్టే పోస్టింగ్‌లకు చెక్‌ పెడదామని నాలుగు రోజుల క్రితం ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లానన్నారు. తాను దాడి చేయడానికి వచ్చానని, అక్కడున్న వారిని బెదిరించానని టీడీపీ నాయకులు పోలీసులు ఫిర్యాదు చేశారన్నారు. పోలీసులు ఆదివారం తమపై కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించకుండా ఇరు వర్గాల వారిపైనా కేసులు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ హయాంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు తాళాలు వేసినా, ప్రబోధానంద ఆశ్రమంపై దాడులకు ఉసిగొల్పి అల్లర్లు సృష్టించినా అప్పటి ప్రభుత్వం కేసు నమోదు చేయకపోవడాన్ని గుర్తు చేశారు.

అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ ఇంటిపై పెద్దారెడ్డి మనుషులు చేసిన దాడిని సీసీ ఫుటేజ్ లో పరిశీలించి పోలీసులే సుమోటోగా కేసు బుక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు పోలీసులపై ఉన్న గౌరవంతోనే తమనే సుమోటోగా కేసు బుక్ చేయాలని చెప్తున్నామని, తాము ఫిర్యాదు చేస్తే 9 మంది గన్ మ్యాన్లు, ఒక ఎస్సై సస్పెండ్ అవుతారన్నారు. 1990లో పెద్దారెడ్డికి చెందిన ట్రూఫ్ ప్రజల నుంచి చీరలు, నగలు ఎత్తుకెళ్లడమే కాకుండా పప్పూరులో ఇళ్లు తగలబెట్టారని జేసీ ప్రభాకర్ గుర్తు చేశారు. 12 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాడికి గన్ మెన్ ఇవ్వడం బాధాకరమని అన్నారు. చంబల్ లోయలో ఉండాల్సినోడు నేడు ఇక్కడి ప్రజలకు ఎమ్మెల్యేగా ఉండటం మన దురదృష్టకరమన్నారు.


Next Story