ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గంగాధర మండపం వద్ద మహిళా భక్తులు ప్రత్యేక కార్తీక దీపారాధన చేశారు. భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడంతో.. వారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పాతాళ గంగలో భక్తుల పుణ్యస్నానాల కోసం మౌళిక వసతులు ఏర్పాటు చేశారు. కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో ఆలయంలో ప్రతిరోజు చేసే అభిషేకాలు, స్పర్శ దర్శనం సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కార్తీకమాసం మొదటి రోజును కార్తీక శుద్ధ పాడ్యమి లేదా బలిపాడ్యమి అంటారు. ఇవాళ భూ లోకంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసేందుకు బలి చక్రవర్తి పాతాళం నుంచి వస్తారని, ప్రతి ఇల్లు దీపాల వెలుగులతో, ఆలంకరణలతో చూసి ఆనందిస్తారని, ఆ ఆనందం శాశ్వతం కావాలని కోరుకుంటూ తిరిగి వెళ్తారని పురాణాల కథ. కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైన మాసంగా భక్తులు భావిస్తారు.