టీడీపీ తీర్థం పుచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణ

కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారికంగా చేరారు.

By అంజి  Published on  23 Feb 2023 11:40 AM GMT
Kanna lakshminarayana,TDP, Andhrapradesh, BJP, Chandrababu

టీడీపీ తీర్థం పుచ్చుకున్న కన్నా లక్ష్మీనారాయణ

అమరావతి: ప్రముఖ రాజకీయ నాయకుడు, బిజెపి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ గురువారం తెలుగుదేశం పార్టీ ( టిడిపి ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అధికారికంగా చేరారు. ముందుగా ప్రకటించినట్లుగానే కన్నా లక్ష్మీనారాయణ మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా వెళ్లి మధ్యాహ్నం 2:48 గంటలకు ముందుగా నిర్ణయించిన ముహూర్తం సమయంలో పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు లక్ష్మీనారాయణకు టీడీపీ పసుపు రంగు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. గుంటూరు రాజకీయ నాయకుల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తమ అధినేత కన్నా బాటలో నడిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం.. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం.. రాజధాని అమరావతి కోసం.. భావి తరాల భవిష్యత్తు కోసం.. నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాను'' అంటూ కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్‌ చేశారు.

కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి 16న భారతీయ జనతా పార్టీ ( బీజేపీ ) కి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అదే కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కన్నాను టీడీపీలోకి స్వాగతించిన చంద్రబాబు నాయుడు లక్ష్మీనారాయణ చేరికను తమ పార్టీకి సానుకూల పరిణామంగా అభివర్ణించారు. గుంటూరు నేతను టీడీపీలోకి మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు తెలిపిన ఆయన లక్ష్మీనారాయణ విశిష్ట వ్యక్తిత్వం కలిగిన నేత అని కొనియాడారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి రావడంతో లక్ష్మీనారాయణ ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు.

''కన్నా.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలో మంత్రిగా (అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో) తన సేవలను అందించారు. రాజకీయాల్లో ఎంతో నిబద్ధతతో పనిచేశారు. ఎన్నటికీ శాశ్వతం కాని అపేక్షిత పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, రాష్ట్రంలో ప్రగతి శకానికి పునరుజ్జీవం పోయడానికి టీడీపీ పునరుజ్జీవం కావాలి'' అని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ మద్దతుదారులు నగరవ్యాప్తంగా ఫ్లెక్స్ బ్యానర్లు, పోస్టర్లు కట్టి గుంటూరు పసుపు రంగును వేశారు. గుంటూరు-మంగళగిరి రహదారిని టీడీపీ పోస్టర్లు, జెండాలతో అలంకరించారు.

Next Story