ఈనెల 23న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. తనతోపాటు తన అనుచరులు అంతా టీడీపీలో చేరతారని.. తెలుగు దేశంలో తన పాత్ర ఏమిటో అనేది అధినేత తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఏ బాధ్యతలు అప్పగించినా తీసుకుంటానని.. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోపే ఆరాచక పాలన మెుదలైందని.. అంతేకాకుండా పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా దిగజారిపోయిందని అన్నారు. అరాచకాలు చేస్తున్న వారిని వదిలి.. పోరాటం చేసే వారిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ అరాచక వాదులకు అనుగుణంగా నడుస్తుందని.. జగన్ అధికారం శాశ్వతం కాదు, ప్రజలు తిరగబడిన రోజున మీకు ఎవరు తోడుండరు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ మీడియా తనపై అసత్య ఆరోపణలు చేయటానికి సిద్ధంగా ఉందని అన్నారు. గత ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అందుకు భిన్నంగా ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. తన యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఏనాడూ ఇలాంటి దుస్థితి చూడలేదని చెప్పుకొచ్చారు. కళ్ల ముందే అరాచకం జరుగుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తుండటం దురదృష్టకరమన్నారు.