వ్యాక్సిన్లను తీసుకున్నా అవి పాటించాల్సిందే..

Just Give Us The Vaccines WHO Pleads, As Poor Countries Lack Doses. కోవిడ్-19 వ్యాక్సిన్ పూర్తిగా తీసుకున్నవారు సైతం మాస్క్‌లను

By Medi Samrat  Published on  26 Jun 2021 6:58 PM IST
వ్యాక్సిన్లను తీసుకున్నా అవి పాటించాల్సిందే..

కోవిడ్-19 వ్యాక్సిన్ పూర్తిగా తీసుకున్నవారు సైతం మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్ప‌ష్టంచేసింది. కరోనా వైరస్ రూపాంతరం డెల్టా వేరియంట్‌ చాలా ప్రమాదకరమైనదని, వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ను పాటించాలని తెలిపింది. మాస్క్ వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. ఔషధాలు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తుల లభ్యత విభాగానికి చెందిన డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ మరియాంగెల సిమావో జెనీవా ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాల‌ను వివ‌రించారు. రెండు డోసులు తీసుకున్నామని, తాము సురక్షితంగా ఉన్నామని భావించరాదని స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినప్పటికీ జాగ్రత్తలను పాటించవలసిందేనని వివరించారు. మాస్క్‌ ధరిస్తూ, గాలి, వెలుతురు బాగా ప్రసరించే చోట ఉండాలని తెలిపారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడకూడదని వివరించారు.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ఘెబ్రెయెసుస్ శుక్రవారం మాట్లాడుతూ డెల్టా వేరియంట్ మొదట భారత దేశంలో కనిపించిందన్నారు. ఇది ఇప్పటి వరకు గుర్తించిన వేరియంట్లలో అత్యంత వేగంగా వ్యాపించే రూపాంతరమని తెలిపారు. ఇది ప్రస్తుతం 85 దేశాల్లో వ్యాపిస్తోందన్నారు. భారత దేశంలో డెల్టా ప్లస్ రూపాంతరం 12 రాష్ట్రాల్లో కనిపించింది. 51 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న ధోరణి కనిపించడం లేదని అధికారులు తెలిపారు. క‌రోనాతో ముప్పు లేని యువ‌త‌కు కూడా ధ‌నిక దేశాలు వ్యాక్సిన్లు అందిస్తుండ‌గా పేద దేశాల్లో రిస్క్ ఉన్న వారికి కూడా అంద‌డం లేవ‌ని ఆయ‌న తెలిపారు. దీంతో ఆఫ్రికాలో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అన్నారు. వారం రోజుల క్రితం ఉన్న ప‌రిస్థితుల‌తో పోల్చి చూస్తే ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్లు, మ‌ర‌ణాలు 40 శాతం పెరిగాయ‌ని ఆయ‌న తెలిపారు. డెల్టా వేరియంట్ వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని తెలిపారు. ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సినేష‌న్ అందించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నామ‌ని చెప్పారు. వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌గా మారింద‌ని ఆయ‌న చెప్పారు. ఆఫ్రికా దేశాల‌కు వ్యాక్సిన్లు పంపాల‌ని ఆయ‌న కోరారు. వ్యాక్సిన్ల విష‌యంలో వివ‌క్ష కొన‌సాగుతోంద‌ని తెలిపారు.


Next Story