పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు : జోగి రమేశ్

Jogi Ramesh Comments On Chandrababu. పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్

By Medi Samrat  Published on  21 Sept 2022 5:19 PM IST
పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు : జోగి రమేశ్

పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. కానీ సీఎం జగన్ కు ఎన్టీఆర్ పై నిజమైన ప్రేమ ఉందని, ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని మంత్రి జోగి రమేశ్ సమర్థించుకున్నారు. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి వైఎస్సార్ అని, వైద్య రంగంలో గొప్ప సంస్కరణలు తెచ్చారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఆరోగ్య భరోసాను అందిస్తే, 108 సర్వీస్ ద్వారా వేలమంది ప్రాణాలు నిలిచాయని వివరించారు. పేదలకు సేవ చేశాడు కాబట్టే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరుపెడుతున్నామని మంత్రి జోగి రమేశ్ వివరించారు. వివాదం సృష్టించడానికి టీడీపీ నేతలు రోజుకొక అంశాన్ని ఎంచుకుంటారని, ఇవాళ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లుపైనా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే నాడు చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారని టీడీపీ నేతలను నిలదీశారు.

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పేరును తొలగించడం అత్యంత సిగ్గుచేటని అన్నారు. దేశ, విదేశాల్లో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. జగన్ ప్రభుత్వానికి గుణపాఠం నేర్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పెట్టి తీరుతామని చెప్పారు.





Next Story