జవాద్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. శుక్రవారం రాత్రి నుండి తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చేపల వేటకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో డిసెంబర్ 3, 4 తేదీల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరిస్థితులను బట్టి తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలోనూ అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించారు. తుఫాన్ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలోని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
తుఫాన్ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు జిల్లా హరికిరణ సెలవు ప్రకటించారు. అదే విధంగా అధికారులకు సెలవు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖ పట్నానికి 960 కి.మీ, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరో 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గంటకు 32 కి.మీ వేగంతో వాయుగుండం ముందుకు కదులుతోందని.. శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.