మీ నాయకత్వంలో ప్రజలు బాగుండి ఉంటే నేను ఆనందించేవాడిని
Janasena Party Formation Day Pawan Kalyan Speech. ఇప్పటంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
By Medi Samrat Published on 14 March 2022 2:44 PM GMTఇప్పటంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ అధికార వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే చెబుతున్నా.. రాజధాని ఎక్కడికీ వెళ్ళదు అని జనసేనాని అన్నారు. ఒకప్పుడు రాజధానిగా అమరావతిని ఒప్పుకున్న అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేతలు.. అధికారం లోకి రాగానే మూడు రాజధానులు అని అంటున్నారని విమర్శించారు. న్యాయస్థానాన్ని కూడా వైసీపీ నేతలు విమర్శించారని.. క్రిమినల్స్ రాజకీయాలను ఏలితే పరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు.
జై ఆంధ్రా, జై తెలంగాణ, జై భారత్ అంటూ ప్రారంభించారు. లోక కల్యాణం కోరే హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ మత పెద్దలకు, నిత్యం రామకోటి రాసే స్త్రీమూర్తులకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు తెలిపారు. కొదమ సింహాల్లాంటి జనసైనికులు, ఆడబెబ్బులి వంటి వీరమహిళలకు శుభాభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్. ఈ సభను మా పొలాల్లో జరుపుకోండి అని సహకరించిన ఇప్పటం రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారని, ఇక్కడ సభ పెట్టుకోండని సహకరించిన ఇప్పటం గ్రామానికి నా ట్రస్టు తరఫున రూ.50 లక్షలు ప్రకటిస్తున్నానన్నారు. సభ నిర్వహణకు అనుమతిచ్చిన అధికారులకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసిన పోలీసు అధికారులకు, నా సోదరులైన పోలీస్ కానిస్టేబుళ్లకు, తోటి భీమ్లానాయక్ లైన మా ఎస్సైలకు థాంక్స్ తెలిపారు.
జగన్ స్వచ్ఛమైన పాలన అందిస్తారని ఆశించామని.. అలాంటిదేమీ జరగలేదని అన్నారు. వైసీపీ నాయకులు, మంత్రులు అంటే కోపం లేదని చెప్పుకొచ్చారు. పాలసీపైనే విబేధాలు తప్ప వ్యక్తిగతంగా దాడి చేయనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో మొదలు పెట్టిందని అన్నారు.. మూడు నెలలకే ఇసుక పాలసీతో.. 3లక్షల భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని, 32 మంది కార్మికులను వైసీపీ బలిగొందని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.