ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసుల తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పోలీసుల తీరు మారకుంటే రోడ్డుక్కుతానని.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని అన్నారు. జనసేన పార్టీపై కొందరు నాయకులు చేస్తున్న దుష్ఫ్రచారాలను పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడుకుంటారని ఆయన అన్నారు. జనసేన జెండా దిమ్మలు పగులకొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
జగ్గయ్యపేటలోనూ జనసేన పతాక ఆవిష్కరణ కోసం నిర్మించుకున్న జెండా దిమ్మెను వైసీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారని మండిపడ్డారు. తమ నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. పోలీసులు ధర్మాన్ని పాటించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యేలు ఈరోజు ఉంటారు, రేపు పోతారని... వచ్చే ఎన్నికల తర్వాత మరో పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులు తల దించుకునే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. జనసేన శ్రేణులు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకుంటున్నారని, అధికార పార్టీకి వత్తాసు పలికేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు.