ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనేదానిపై ఓ క్లారిటీ వచ్చింది.
గతంలో లోక్‌సభకు అంటూ ఒకసారి, లేదు ఎమ్మెల్సీ అంటూ మరోసారి.. కాదు కార్పొరేషన్ పదవి అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. జనసేన పార్టీలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆయన పార్టీకోసం విశేషంగా కృషి చేశారు. అయితే ఆయనకు ఆ సమయంలో సీటు దక్కలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటులో ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయనకు ఏదో ఒక మంచి పదవి దక్కుతుందని జనసేన కార్యకర్తలు ఎదురు చూశారు. ఆ తర్వాత ఆయనను లోక్‌సభకు పంపిస్తారని అంతా అనుకున్నారు. అప్పట్లో మూడు స్థానాలు ఖాళీ అవగా.. నాగబాబుకు వాటిలో దక్కలేదు. ఆ సమయంలో చంద్రబాబు నుంచి ఓ ప్రకటన కూడా వెలువడింది. నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించడంతో అంతా ఓ క్లారిటీ వచ్చింది. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవగానే ఆయనను శాసనమండలికి పంపి మంత్రి పదవి ఇస్తారని అంతా భావించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేసినట్లు సమాచారం.