కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు: నాదెండ్ల
జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్..
By Medi Samrat Published on 13 Oct 2023 9:00 PM ISTజనసేనాని పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుతనంతో మాట్లాడుతుంటే రాష్ట్రంలో మహిళలందరూ గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి జిల్లాలోనూ వీరమహిళలు ఈ దిశగా పోరాటానికి సిద్ధం కావాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ప్రతిసారి ఎందుకు ఇలా కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడో తేల్చుకుందాం. ఈ ముఖ్యమంత్రికి సంస్కారం నేర్పిద్దాం... అందుకోసం కార్యాచరణ రూపొందించుకుందామన్నారు నాదెండ్ల మనోహర్.
సీఎం జగన్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ కూడా స్పందించారు. సీఎం జగన్ వ్యాఖ్యలు విన్న తర్వాత నుంచి ఎంతో వేదనను అనుభవిస్తున్నట్లు చెప్పారు బండ్ల గణేష్. ఇప్పటికైనా మాట్లాడకపోతే తన బతుకుపై తనకే చిరాకు కలుగుతుందని అన్నారు. తనకు దైవ సమానుడైన పవన్ కళ్యాణ్ గురించి సీఎం జగన్ అభ్యంతరకరంగా మాట్లాడారని అన్నారు. జగన్ ఒక పెద్ద హోదాలో ఉన్నారు. భగవంతుడు ఆయనకు అద్భుతమైన పొజిషిన్ ఇచ్చారని అన్నారు. పవన్ నిజాయితీపరుడు, ఎవరు కష్టాల్లో ఉన్నా అవన్నీ తనవని భావించే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. అందరి జీవితాల్లో చేదు ఘటనలు జరుగుతాయి.. అలాగే పవన్ ప్రమేయం లేకుండా ఆయన లైఫ్‌లో కొన్ని జరిగాయన్నారు. ప్రజల కోసమే రాత్రింబవళ్లు కష్టపడుతున్న వ్యక్తి పవన్ అన్నారు. షూటింగ్‌లు చేసి సంపాదించిన డబ్బును జనసేన పార్టీ కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడా రూపాయి తీసుకోకుండా పార్టీ నడుపుతున్న మహానుభావుడు అంటూ పవన్‌ను కొనియాడరు బండ్ల గణేష్. అలాంటి వ్యక్తిపై అభాండాలు వేయొద్దని బండ్ల గణేష్ చేతులెత్తి మొక్కారు.