నిరుద్యోగ యువతకు అండగా జనసేన పోరాటం
Janasena Fight Against Job Calendar. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగ యువతకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని
By Medi Samrat Published on 16 July 2021 1:37 PM GMTజాబ్ క్యాలెండర్ పేరుతో మోసపోయిన నిరుద్యోగ యువతకు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో వైసీపీ చెప్పిన మాటలు నమ్మిన నిరుద్యోగ యువత.. జాబ్ క్యాలెండర్ లో చూపించిన ఖాళీలతో మోసపోయిందని ఆయన అన్నారు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అందుకు సంబంధించిన పోటీ పరీక్షల కోసం.. యువతీయువకులు ఎన్నో కష్టాలను ఓర్చుకొని సిద్ధమవుతున్నారని.. సుమారు 30 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఏపీపీఎస్సీ ద్వారా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చివరకు.. జాబ్ క్యాలెండర్లో 10వేల ఉద్యోగాలను మాత్రమే చూపడం కచ్చితంగా యువతను వంచించడమే అని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ యువత ఆందోళనకు జనసేన పార్టీ బాసటగా నిలుస్తుందని.. ఇందులో భాగంగా తొలుత ఈ నెల 20వ తేదీన అన్ని జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులు నిరుద్యోగ యువతను కలుపుకొని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజిలకు వెళ్ళి.. కార్యాలయం అధికారులకు నిరుద్యోగుల తరఫున వినతి పత్రాలు అందిస్తారని అన్నారు.
జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం పునఃసమీక్షించి.. ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలతో.. తాజాగా మరో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తేనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పవన్ అన్నారు. కొద్ది నెలల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగాల భర్తీపై సమీక్షిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2ల్లో సుమారు వెయ్యి ఖాళీలను గుర్తించారని.. కేవలం 36 ఖాళీలను మాత్రమే చూపించడం అంటే నిరుద్యోగులను మోసం చేయడమే అని అర్థం అవుతుందని పవన్ అన్నారు. ఉపాధ్యాయ పోస్టులు కూడా వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయని.. సీఎం జగన్ చెప్పిన మెగా డీఎస్సీ ఏమైపోయింది? అని ప్రశ్నించారు. పోలీసు శాఖలో 7వేలకు పైగా ఖాళీల భర్తీ గురించి.. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కలిగించలేదని పవన్ అన్నారు.