ఆ జిల్లా పేరు మార్చాలని జనసేనాని డిమాండ్
Janasena Demands For Kurnool District Name Change. కొందరు గొప్ప గొప్ప నాయకులు పుట్టిన జిల్లాలకు వారి పేర్లు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుండో
By M.S.R Published on 22 Oct 2021 5:14 PM ISTకొందరు గొప్ప గొప్ప నాయకులు పుట్టిన జిల్లాలకు వారి పేర్లు పెట్టాలనే డిమాండ్ ఎప్పటి నుండో వస్తూ వస్తుంది. ఇప్పటికే దేశంలో పలు జిల్లాల పేర్లు మార్చడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అలా పేర్లు మార్చారు. తాజాగా జనసేన పార్టీ ఓ సరికొత్త డిమాండ్ తో ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లా పేరు మార్చాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కోరారు. అందుకు సంబంధించి జనసేన పార్టీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటి వరకూ అంతటి మహనీయుని పేరు ఒక్క ప్రభుత్వ పథకానికీ పెట్టలేదని.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరు మార్చకపోతే, అధికార మార్పిడి తర్వాత ఆ పని జనసేన పార్టీ చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లా అని మార్చినప్పుడు... అణగారిన వర్గాలకు అండగా నిలిచిన దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. ఆయన పేరు పెట్టడం సమంజసమే అని పవన్ చెప్పుకొచ్చారు. దామోదరం సంజీవయ్య గురించి తాను రెండున్నర దశాబ్దాలుగా వింటున్నానని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆయన రెండు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారని, అయినప్పటికీ ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని పవన్ అన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఆరు లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
తెలుగుపై ఆయనకు ఎనలేని అభిమానం ఉండేదని పవన్ అన్నారు. వృద్ధాప్య పింఛన్ల పథకానికి రూపకల్పన చేసింది దామోదరం సంజీవయ్యేనని గుర్తు చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ల వ్యవస్థను తీసుకువచ్చారని తెలిపారు. కార్మికశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి కార్మిక పక్షపాతిగా దామోదరం సంజీవయ్య గుర్తింపు పొందారని, ఆయన గొప్పతనాన్ని భావితరాలకు తెలియ చేస్తామని అన్నారు.