తెలంగాణ జన్మస్థలం, ఏపీ కర్మస్థలం..జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By Knakam Karthik  Published on  14 March 2025 10:00 PM IST
Andrapradesh, Janasena,  PawanKalyan, Jayakethana Meeting

తెలంగాణ జన్మస్థలం, ఏపీ కర్మస్థలం..జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

2014లో అన్నీ తానై పార్టీ పెట్టానని, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద నిర్వహించారు. ఈ సభలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేశామని... ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు. "మనం నిలబడ్డాం... పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం... మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచులను అవమానించారు, ప్రజలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని మన జనసైనికులు, వీరమహిళలు అడిగితే, గొంతెత్తితే వాళ్లపై కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు..అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.

నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ నాయకుడ్ని అక్రమ కేసుల్లో జైల్లో బంధించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, వారి సీనియర్ నేతలను రోడ్డు మీదికి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడ్ని అయితే వారు తిట్టని తిట్టు లేదు, చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడలను బద్దలు కొట్టాం. ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతోటి అడుగుపెట్టాం. దేశం అంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించాం... ఇవాళ జయకేతనం ఎగరేస్తున్నాం..అని పవన్ ప్రసంగించారు.

జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావిం అయ్యా. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశాం. బహు భాషలే భారతదేశానికి మంచిది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలి. అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లు పార్టీని నడిపా. మన పార్టీకి 11వ సంవత్సరం.. వాళ్లను 11 సీట్లకు పరిమితం చేశాం. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే ఖుషీ సినిమా చూసి గద్దరన్న నన్ను ప్రోత్సహించారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు. సగటు మధ్యతరగతి మనిషిగా బతకడమే నా కోరిక. చంటి సినిమాలో మీనాను పెంచినట్టు నన్ను పెంచారు. అలాంటి నన్ను సినిమాలు చేస్తానని, రాజకీయాల్లోకి వస్తానని ఎవరూ ఊహించి ఉండరు..అని పవన్ కల్యాణ్‌ చెప్పారు.

Next Story