ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగింది: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

By Medi Samrat  Published on  30 Dec 2023 2:40 PM IST
ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగింది: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఈ ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని.. భూ సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని అన్నారు. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని.. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఐదు పేజీల ఈ లేఖలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ప్రభుత్వం రూ.32,141 కోట్ల నిధులను విడుదల చేసిందని.. భూ సేకరణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలోనే భారీ అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని.. మొత్తంగా 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తవగా.. అందులో కేవలం 86,984 మందికి మాత్రమే అందించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

లేఖలోని ప్రధాన అంశాలు...

1. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించింది. ఇందుకు సంబంధించి ఖర్చు చేసిన నిధుల్లో గోల్ మాల్ జరిగింది. భారీగా నిధులు పక్కదారి పట్టాయి.

2. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు అయితే, ప్రభుత్వం మాత్రం రూ.91,503 కోట్లుగా చెబుతోంది. ఈ అంశంలో అనేక సందేహాలున్నాయి..

3. ఇళ్ల విషయంలో ప్రభుత్వం పేదలను మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోంది.

4. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29,51,858 మంది మహిళల పేరుతో స్థలాలను ఇవ్వాలని నిర్ణయించారు. అయితే వాస్తవంలో 21.87,985 మందికే పట్టాలకు లబ్ధిదారులను గుర్తించారు.

5. మొదట చెప్పినట్లుగా 30 లక్షల గృహాలను నిర్మించకుండా కేవలం 17,005 జగనన్న లే అవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు.

6. ఈ మొత్తం పథకంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరుతో వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు.

7. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పేదలందరికీ ఇళ్లు పథకంలో కేంద్ర ప్రభుత్వ గృహ స్కీంలను కలిపేసింది.

పీఎంఏవై (అర్బన్, రూరల్), జేజేఎం, ఎంజీఎన్ఆర్ఈజీపీ, ఎస్బీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు.

ఇలా చాలా విషయాలను లేఖలో ప్రస్తావించారు పవన్ కళ్యాణ్.

Next Story