ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Janasena Chief Pawan Kalyan comments on tenth class results.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోమ‌వారం విడుద‌ల చేసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 9:24 AM GMT
ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సోమ‌వారం విడుద‌ల చేసిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌కు విద్యార్థుల‌ను ఫెయిల్ చేశారని ప‌వ‌న్ ఆరోపించారు. ఇంట్లో త‌ల్లిదండ్రుల‌దే త‌ప్పు అంటూ వాళ్ల‌పై నెపం వేస్తారా..? అంటూ మండిప‌డ్డారు. 10 గ్రేస్ మార్కులు ఇచ్చి విద్యార్థుల భ‌విష్య‌త్తు కాపాడాల‌న్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.

"ప‌ట్టుమ‌ని ప‌ది ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి నిరుద్యోగుల‌కు ఉపాధి క‌ల్పించ‌లేరు. గిట్టుబాటు ధ‌ర క‌ల్పించి రైతుల‌కు అండ‌గాను ఉండ‌లేరు. ధ‌ర‌ల‌ను అదుపులో ఉంచి ప్ర‌జ‌ల‌ను ఎలానూ సంతోష‌పెట్ట‌లేరు. క‌నీసం పిల్ల‌ల‌కు స‌రైన చ‌దువు చెప్పించి వారిని ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్ద‌లేరా..? ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాలు చూస్తే ఆ ప‌ని కూడా చేయ‌లేని చేత‌కాని ప్ర‌భుత్వ‌మని మ‌రోసారి స్ప‌ష్టం అవుతోంది.

పిల్ల‌లు చ‌దువులో ప‌రీక్ష‌ల్లో ఫెయిలైతే ఇంట్లో త‌ల్లిదండ్రుల మార్గ‌ద‌ర్శ‌కం స‌రిగా లేదు అని నెపం వేస్తారు. ఆడ‌పిల్ల‌ల మాన‌మ‌ర్యాద‌ల‌ను నేర‌గాళ్లు భంగ‌ప‌రిస్తే త‌ల్లుల పెంప‌కం స‌క్ర‌మంగా లేదు అని సెల‌విస్తారు. అప్పుల పాలై వేరే మార్గం కాన‌రాక‌, ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని న‌మ్మ‌కం లేక కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డితే అస‌లు వారు కౌలు రైతులు కానే కాదు అంటూ తిమ్మిని బ‌మ్మిని చేస్తారు. వైసీపీ స‌ర్కారు వారి ఇటువంటి వాద‌న‌లు వింటుంటే ఈ ప్ర‌భుత్వంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనే కాదు తెలుగువారంద‌రికీ రోత క‌లుగుతోంది. మీరు చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం మీ పాల‌న స‌రిగా లేదు. మ‌రి దీనికి ఎవ‌రిని నిందించాలి..?

2018,19 సంవ‌త్స‌రాల్లో ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే వ‌రుస‌గా 94.48 శాతం, 94.88 శాతం ఉండ‌గా.. ఈ ఏడాదికి సంబంధించి విడుద‌లైన ఫ‌లితాల్లో 67.26 శాతం మంది మాత్ర‌మే ఉత్తీర్ణుల‌య్యారు. గ‌త ఫ‌లితాల‌తో పోలిస్తే ఇది అత్య‌ల్ప ఉత్తీర్ణ‌త‌. రెండు ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనికి కార‌ణం త‌ల్లిదండ్రులే అని చెప్పి మీరు మీ చేత‌గాని త‌నాన్ని దాచి పెట్టుకోవ‌చ్చు. విద్యా వ్య‌వ‌స్థ‌లో మీ లోప‌భూయిష్ట విధానాల‌ను మాత్రం చ‌రిత్ర దాచి పెట్టుకోదు. పాఠ‌శాల‌ల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మం పెట్టి పాఠ‌శాల‌ల‌కు రంగులేస్తున్నాం. ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పేస్తాం అన‌గానే స‌రిపోదు. నాడు-నేడు కోసం రూ.16 వేల కోట్లు ఇచ్చామ‌ని చెప్పుకొన్నారు. ఆ వేల కోట్ల రూపాయ‌లు ఎటుపోయాయి అనిపిస్తోంది ఈ ఫ‌లితాలు చూస్తే. ముందుగా త‌గినంత‌మంది బోధ‌న సిబ్బందిని నియ‌మించాలి. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి డీఎస్సీ ప్ర‌క‌ట‌నే ఇవ్వ‌లేదు అనేది చెడు వాస్త‌వం. విద్యా ప్ర‌ణాళిక ప‌టిష్టంగా ఉండాలి. జాతీయ, అంత‌ర్జాతీయ విద్యాపారంగ‌తుల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. అప్పుడే క‌దా మంచి ఫ‌లితాలు వ‌చ్చేది.

అర‌కొర ఉన్న ఉపాధ్యాయుల‌కు మ‌ద్యం షాపులు ద‌గ్గ‌ర క్యూ లైన్ల నిర్వ‌హ‌ణ‌కు డ్యూటీ వేసిన ఈ ప్ర‌భుత్వం నుంచి ఏం ఆశించాలి..? సిగ్గుప‌డే అలాంటి డ్యూటీలు చేయించి.. మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌, మ‌ధ్యాహ్నా భోజ‌న ప‌థ‌కంలో ఫోటోలు తీయ‌డం వంటి ప‌నులు అప్ప‌గించి విద్యార్థుల‌కు పాఠాలు చెప్పే అస‌లు విధుల‌కు దూరం చేసిన పాప‌మే ఈ నాటి ఫ‌లితాలు. రీ వాల్యూయేష‌న్ చేస్తాం రూ.500 క‌ట్టండ‌ని మ‌రో దోపిడికీ స‌ర్కారు వారు తెర దీశారు. అదేమీ కుద‌ర‌దు. ప‌రీక్ష త‌ప్పిన పిల్ల‌ల ల మాన‌సిక స్థితి,వారి భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని, వారి విలువైన కాలం వృథా కాకుండా ఫెయిల్ అయిన వారికి 10 గ్రేస్ మార్కుల‌ను ఇవ్వాలి. ఆ త‌రువాత రీ కౌంటింగ్‌ను.. ఆఫైన స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను ఉచితంగా చేయాల‌ని జ‌న‌సేన ప‌క్షాన‌, పిల్ల‌ల త‌ల్లిదండ్రుల ప‌క్షాన డిమాండ్ చేస్తున్నాను "అని ప‌వ‌న్ అన్నారు.

Next Story