జైలు నుంచి విడుదలైన జనసేన నాయకులు
Jana Sena leaders released from jail. విశాఖ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ నేతల కార్లపై దాడికి సంబంధించిన అరెస్టు అయిన జనసేన నేతలు
By Medi Samrat Published on 22 Oct 2022 6:30 PM IST
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద వైసీపీ నేతల కార్లపై దాడికి సంబంధించిన అరెస్టు అయిన జనసేన నేతలు శనివారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో మొత్తం 70 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా... వారిలో 61 మందికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మిగిలిన 9 మందికి స్థానిక కోర్టు రిమాండ్ విధించగా వారంతా విశాఖ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ ఇవ్వాలన్న నిందితుల పిటిషన్లను స్థానిక కోర్టు కొట్టివేయగా... తాజాగా వారంతా హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం వీరి పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు మొత్తం 9 మందికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత శనివారం 9 మంది జనసేన నేతలను విశాఖ జైలు అధికారులు విడుదల చేశారు. విశాఖ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన జనసేన ప్రధాన కార్యదర్శులు టి.శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా.రఘులను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరిపై తదుపరి విచారణను వాయిదా వేసింది.
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసును బనాయించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశారని.. వారికి ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని తెలిపారు. విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని పవన్ తెలిపారు. విశాఖ గర్జనకు హాజరైన వైసీపీ నేతలు తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ ఎయిర్ పోర్టుకు రాగా.. అదే సమయంలో విశాఖకు వస్తున్న జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు జన సైనికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల కార్లపై దాడికి దిగారనే అభియోగాలు మోపబడ్డాయి.