వారాహిని బయటకు తీస్తున్న పవన్ కళ్యాణ్
Jana Sena chief Pawan Kalyan will start Varahi Bus Yatra from June 14. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూన్ 14 నుండి వారాహి బస్సు యాత్రని ప్రారంభించనున్నారు.
By Medi Samrat Published on 3 Jun 2023 2:45 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్, జూన్ 14 నుండి వారాహి బస్సు యాత్రని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తన పర్యటనను ప్రారంభించనున్నారు పవన్. తొలి విడత బస్సు యాత్రలో భాగంగా పవన్ తూర్పుగోదావరి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత భీమవరం, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, మామిడివరం, రాజోలు, పి గన్నవరం, నరసాపురం లలో పర్యటించనున్నారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసే సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ఈనెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అన్నవరం దర్శనం తర్వాత పత్తిపాడు నుంచి యాత్ర మొదలవుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కల్పించేలా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. స్థానికుల నుంచి సమస్యలపై పవన్ అర్జీలు తీసుకుంటారని, సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఆయన పర్యటిస్తారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని ప్రకటించారు. వారాహి వాహనాన్ని రెడీ చేసి చాలా కాలమే అయినా కూడా వాడలేదని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక జనాల్లోకి వెళ్లాల్సిన సమయం దగ్గర పడడంతో పవన్ కళ్యాణ్ వారాహిని బయటకు తీస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, OG, బ్రో, హరి హర వీర మల్లు వంటి పలు ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ సినిమాలకే తన టైమ్ ను కేటాయించారు పవన్. ఇప్పుడు ఆయన రాజకీయ జర్నీ కారణంగా సినిమా షూటింగులకు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉంది.