ఏపీ ప్ర‌భుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. చిరు వ్యాపారులను ఆదుకునేందుకు 'జగనన్న తోడు' పథకాన్ని ప్రారంభించారు. సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకు 6.40 లక్షల మంది చిరువ్యాపారులను గుర్తించామన్నారు. 10 లక్షల మంది లబ్ధిదారులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో చిరు వ్యాపారుల కష్టాన్ని చూశానన్నారు. చిరువ్యాపారులకు శ్రమ ఎక్కువ.. లాభం తక్కువని తెలిపారు. చిరు వ్యాపారుల జీవితాల్లో మార్పు తీసుకొస్తామన్నారు. చిరువ్యాపారులు లేకపోతే ఆర్థిక వ్యవస్థ కూడా నడవదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

చిరు వ్యాపారులకు బ్యాంకు నుంచి రూ.10వేల రుణాన్ని అందించనున్నారు. మొదటగా 10 లక్షల మంది వ్యాపారులకు బ్యాంకుల నుంచి రుణం అందిస్తున్నారు. ఇక బ్యాంకు అకౌంట్లు లేనివారికి అకౌంట్లు కల్పించబోతున్నారు. ఐదడుగుల, అంతకంటే తక్కువ స్థలంలో ఉన్న షాపులకు, ఫుట్ పాత్ లపైన, తోపుడు బండ్లపైన, గంపల్లో వివిధ వస్తువులను పెట్టుకొని ఊరూరా తిరిగి అమ్ముకునే వ్యాపారాలు, గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలు ఆదాయం ఉన్నవారు ఈ తోడు స్కీమ్ కి అర్హులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని సీఎం పేర్కొన్నారు.


సామ్రాట్

Next Story