నేడు 'జగనన్న జీవ క్రాంతి'కి శ్రీకారం
Jagananna Jeeva Kranthi. ఏపీలో వైయస్. జగన్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టింది.
By Medi Samrat Published on 10 Dec 2020 8:44 AM ISTఏపీలో వైయస్. జగన్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. జగనన్న జీవక్రాంతి పథకం ద్వారా గొర్రెలు, మేకల పెంపకానికి ఆసక్తి కనపర్చిన మహిళలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయం, బ్యాంకు రుణం కల్పించాలని నిర్ణయించింది. 45 –60 సంవత్సరాల వయస్సు గల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ రుణసదుపాయం కల్పించనుంది. ఋణంలో అసలు మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేస్తూ, రైతు భరోసా కేంద్రాల ద్వారా గొర్రెల, మేకల యూనిట్లు పంపిణీ చేసి వారికి ఆసరా ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా రూ.1868.63 కోట్లు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.2.49 లక్షల గొర్రెల లేదా మేకల యూనిట్లను జగనన్న జీవ క్రాంతి పథకం కింద పంపిణీ చేయనున్నారు. తొలివిడతలో భాగంగా మార్చి 2021 వరకు 20వేల యూనిట్లు, రెండవ విడత ఏప్రిల్ 2021 నుంచి ఆగష్టు 2021 వరకు 1,30,000 యూనిట్లు, మూడవ విడత సెప్టెంబరు 2021 నుంచి డిసెంబరు 2021 వరకు 99,000 యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నేడు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
అవగాహన – శిక్షణ
ఈ పథకంలో ఎంపికైన మహిళా లబ్ధిదారులకు గొర్రెలు, మేకల యూనిట్ల కొనుగోలుకు ముందే మేలు రకమైన జాతి, యూనిట్ సైజు, ఖరీదు, ఎంపిక చేసుకునే విధానం, కొనుగోలు చేసే ప్రాంతం, రవాణా, బీమా సౌకర్యం మొదలుగు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.
ఇలా ఎంపిక చేసిన ఒక్కో యూనిట్‌లో 14 (తల్లి నుంచి వేరు చేసిన 5–6 నెలల వయసు గల గొర్రె లేదా మేక పిల్లలు మరియు ఒక యవ్వనపు పొట్టేలు లేదా మేకపోతు ఉంటాయి. ఈ యూనిట్ ఖరీదును రవాణా మరియు బీమా ఖర్చు కలుపుకుని రూ.75,000 గా నిర్ణయించారు. లబ్దిదారులు గొర్రెలలో నెల్లూరు బ్రౌన్, జోడిపి, మాచర్ల, బ్రౌన్ మరియు విజయనగరం జాతులు, మేకలలో బ్లాక్ బెంగాల్ లేదా స్ధానిక జాతులలో నచ్చిన జీవాన్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కో లబ్దిదారునికి ఒక యూనిట్ మాత్రమే పంపిణీ చేయనున్నారు.
పారదర్శకత
ఇక యూనిట్ల కొనుగోలు మరియూ పంపిణీలో ఎటువంటి అవినీతికి, అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా చేపట్టేందుకు నిర్ధిష్టమైన విధివిధానాల రూపొందించారు. సెర్ఫ్ ఆధ్వర్యంలో ఆప్షన్ ఇచ్చిన అక్కచెల్లెమ్మలకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన గొర్రెలు, మేకలు కొనుగోలుకు వెసులుబాటు ఇచ్చారు. దీని కోసం ఇద్దరు పశువైద్యులు,
సెర్ఫ్ ప్రతినిధి, బ్యాంకు ప్రతినిధి సంబంధిత లబ్దిదారునితో కూడిన 5 సభ్యుల కమిటీ నిర్ధారిస్తుంది. అలా నిర్ధారించిన ధరకు లబ్ధిదారులు స్ధానిక రైతు భరోసా కేంద్రం నుంచి లేదా సంతకు వెళ్లి పశువులను తనిఖీ చేసిన తరువాత లబ్ధిదారుని ఆసక్తి ప్రకారం కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన జీవాలకు గుర్తింపు కొరకు చెవిపోగులు చేసి, 3 సంవత్సరాల వరకు బీమా సౌకర్యం అందించనుంది.
పోషణ
ఈ పథకం ద్వారా కొనుగోలు చేసిన జీవాలకు స్ధానిక రైతు భరోసా కేంద్రాల ద్వారా అధిక పోషక విలువలు గల సమతుల్య దాణా, ఖనిజ, లవణ మిశ్రమం ఇవ్వనుంది. దీంతో పాటు లబ్ధిదారునికి ఉన్న నీటి సౌకర్యం, భూ లభ్యతను బట్టి ఉపాధి హామీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డు మరియు పశుసంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాసం పెంచుకోవడానికి ప్రభుత్వం మద్ధతు ఇవ్వనుంది. పశు విజ్ఞాన బడి ద్వారా యాజమాన్య పద్ధతులపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
నికర ఆదాయము
ఈ పథకం ద్వారా కొనుగోలు చేసిన ఒక్కొక్క యూనిట్‌కు 3 సంవత్సరాలలో ఒక్కొక్క కుటుంబానికి నికరంగా రూ.1,28,848 ఆదాయం సమకూరనుంది.
మార్కెటింగ్ సదుపాయము
ఇంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అల్లానా పుడ్స్ సంస్ధతో అనుసంధానం అయింది. ఇందులో భాగంగా మాంసం, మాంస ఉత్పత్తుల విక్రయం ద్వారా ఆదాయం సమకూర్చుకునే ఆసక్తి గల ఔత్సాహిక మహిళలకు శిక్షణతో పాటు నాణ్యమైన, ప్రాసెస్ చేసిన మాంసాన్ని సరఫరా చేసి వారిని ప్రోత్సహించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాలో ఈ సంస్ధ కేంద్రాన్ని ప్రారంభించి కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా వాటి శాఖలను విస్తరించే యోచన చేస్తోంది.
జీవాల మాంసానికి ఎలాంటి అవరోధాలు లేకపోవడం, అధిక ప్రోటీన్లు కలిగి రోగనిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడటంతో డిమాండ్ ఎక్కువగా ఉండి పెంపకందారులకు వాణిజ్యపరంగా మంచి భవిష్యత్ ఉంటుంది. ఫలితంగా జీవాల పెంపకంలో ఎక్కువ పెట్టుబడి అవసరం లేకుండానే అధిక లాభాలు పొందవచ్చు.
శిక్షణా కేంద్రాలు
కర్నూలు జిల్లాలో 25 లక్షల గొర్రెల మరియు మేకల పెంపకం దారులు, అనంతపురము జిల్లాలో 58 లక్షల పై చిలుకు పెంపకందారులు జీవనోపాధి పొందుతున్నారు. కరువు పీడిత ప్రాంతాలైన ఈ రెండు జిల్లాలలో రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఇక్కడ శిక్షణా కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. వీరికి గొర్రెల, మేకల పెంపకం నూతన యాజమాన్యం పట్ల ఆవగాహన కల్పించనుంది. తద్వారా వారికి మెరుగైన ఆదాయం కల్పించే చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా ధోన్ మండలం ప్యాపిలి గ్రామంలో రూ.5 కోట్ల ఖర్చుతోను, అనంతపురము జిల్లాలో పెనుగొండలో రూ.2.5 కోట్లతో గొర్రెల, మేకల పెంపకందార్లకు శిక్షణా కేంద్రాలు మంజూరు చేసింది.