రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి: సిఎం జగన్
Jagan Speech In BC Sankranthi Sabha. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానంలో జరిగిన బీసీ సంక్రాంతి సభ
By Medi Samrat Published on 17 Dec 2020 5:17 PM IST
విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానంలో జరిగిన బీసీ సంక్రాంతి సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, మన సంస్కృతికి వెన్నెముక కులాలు అని అన్నారు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నెముక విరిచిన పరిస్థితిని చూశామని, తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్లలో అత్యధికశాతం నా అక్కచెల్లెమ్మలే ఉండడంతో సంతోషంగా ఉంది అని సీఎం జగన్ అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశచరిత్రలో ఇదే తొలిసారి అని స్పష్టం చేశారు.
కేబినెట్ కూర్పులోనూ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం పదవులు ఇచ్చామని తెలిపారు. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండింట బీసీలకు అవకాశం ఇచ్చామని వివరించారు. టీడీపీ జెండాను తాము మోశామని సర్టిఫికెట్ చూపిస్తే తప్ప కార్పొరేషన్ల ద్వారా మేలు జరిగేది కాదని.. కార్పొరేషన్ల వ్యవస్థను అంతగా దిగజార్చారని ఆరోపణలు గుప్పించారు. రాజకీయాలకు, పార్టీలకు సంబంధం లేకుండా, లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికీ కార్పొరేషన్ల ద్వారా మేలు జరగాలి. అందుకే సంపూర్ణంగా మార్పులు తీసుకొస్తున్నామని జగన్ అన్నారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించామని తెలిపారు.