అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా మోసం చేస్తారా? ఉద్యోగులకిచ్చిన హామీలపై జగన్ ట్వీట్
రాష్ట్రంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు
By - Knakam Karthik |
అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా మోసం చేస్తారా? ఉద్యోగులకిచ్చిన హామీలపై జగన్ ట్వీట్
అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు గారూ..ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురుచూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరంమీద తప్ప, ప్రజలమీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజలమీద, ఉద్యోగస్తులమీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు.
మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే IR అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతి ఏమైంది? మేం అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లోనే ఉద్యోగులకు IR ప్రకటించాం. అంతేకాకుండా మా హయాంలోనే మేం PRC వేసి, దానికి ఛైర్మన్‌నుకూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, IR ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా PRC ఛైర్మన్‌ని వెళ్లగొట్టారు. ఆతర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్‌ను పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దానిగురించి ప్రస్తావించడంలేదు. ఇప్పటిదాకా ఇవ్వాల్సిన 4డీఏలు మొత్తం పెండింగ్. దసరా పండుగకు డీఏలు క్లియర్ అవుతాయని ఉద్యోగస్తులందరూ ఎంతో ఎదురుచూశారు. ఇప్పుడు దీపావళి పండుగ కూడా వస్తోంది. కాని, ఇచ్చే ఆలోచన మీకున్నట్టు అనిపించడం లేదు.
ఉద్యోగులకు EHSకింద ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులన్నీ వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. పేరుకు హెల్త్ కార్డులున్నా దానివల్ల ప్రయోజనం లేకుండా పోతోంది. EHS కోసం ప్రభుత్వం తనవాటాగా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోవడమే కాదు, తమ వాటాగా ఉద్యోగులు చెల్లించిన దాన్నికూడా విడుదలచేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? చంద్రబాబుగారూ.. దాదాపు రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు. వారికిచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోడ్డెక్కుతూ మిమ్మల్ని ఎండగడుతున్నారు...అని జగన్ ట్వీట్ చేశారు.
.@ncbn గారూ.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డుమీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది? మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి,… pic.twitter.com/CFIDuN9w7W
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 6, 2025