ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు
Jagan Mohan Reddy ruined Andhra Pradesh, says TDP. ఒకప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా
By Medi Samrat Published on 30 Oct 2022 4:14 PM ISTఒకప్పుడు ప్రగతి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి మోసపూరిత ప్రచారాలకు పాల్పడుతున్నారని, తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే రాష్ట్ర ప్రజల మధ్య మత, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. దూరదృష్టి గల చంద్రబాబు ఎంతో కష్టపడి నిర్మించిన రాష్ట్రాన్ని ఈ మూడున్నరేళ్లలో పూర్తిగా నాశనం చేశారని రామకృష్ణుడు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిలుపుదల చేయడం జగన్ రెడ్డి దుర్మార్గ పాలనకు నిదర్శనమన్నారు. వైఎస్సార్‌సీపీ పాలనకు ప్రజలు గుడ్‌బై చెప్పేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని అన్నారు. రాష్ట్రంలో సున్నా వడ్డీ, పంట రుణాలు వంటి పథకాలు సక్రమంగా అమలు కాకపోవడంతో రైతులు అభద్రతా భావానికి లోనవుతున్నారని, దీంతో రైతులు ప్రయివేటు రుణాల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రైతులకు పెనుభారంగా మారిన వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 12 లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాలు మంజూరు చేశారని గుర్తు చేసిన యనమల రామకృష్ణుడు.. ఇప్పుడు రెండు లక్షల మంది రైతులకు కూడా రుణాలు మంజూరు చేయలేదన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయని, వ్యవసాయ రంగానికి అందిస్తున్న సాయాన్ని ఇది తెలియజేస్తోందని ఆయన అన్నారు.
విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలను జగన్ పూర్తిగా విస్మరించారని యనమల ఆరోపించారు. ఈ రంగాలను అభివృద్ధి చేయడం కంటే సంస్థల పేర్లు మార్చడానికే ముఖ్యమంత్రి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. 2017-18లో నీతి ఆయోగ్ విడుదల చేసిన జాతీయ ఆరోగ్య సూచీలో నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 10వ స్థానానికి పడిపోయిందని, రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కార్డులను గౌరవించడం లేదని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం రుణాలు, అభివృద్ధి విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతోందని, సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని రామకృష్ణుడు మండిపడ్డారు. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం తప్ప మరే ఇతర వస్తువులు సరఫరా కావడం లేదని ఆరోపించారు.