వ్యక్తిగత ఇమేజ్ కోసం పంచుతూ పోతే ఏమీ మిగలదు
IYR Krishnarao Fires On Govt. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఆ పార్టీ నేత
By Medi Samrat Published on 19 Oct 2021 9:37 AM GMTరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, ఆ పార్టీ నేత ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పంచుతూ పోతే పంచడానికి ఏమీ మిగలదని ఆయన అన్నారు. చంద్రబాబు, జగన్ చేసిన అప్పులు రూ.5 లక్షల కోట్లకు చేరాయని.. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అందుకునే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరిపోతుంటే మౌలిక సదుపాయాల మాటేమిటి అని ప్రశ్నించారు. రోడ్ల దుస్థితి, ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని స్థితి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో పెన్షన్లు, జీతాల అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు 35% సరిపోతుందని.. భవిష్యత్తులో నెల నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమేనని అబిప్రాయం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పుగా ఇవ్వాలని అడుగుతున్న అధికారులు, ఇకపై తమ నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. చెప్పినవన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్రదండం గాని అల్లావుద్దీన్ అద్భుతదీపం గాని లేవని గ్రహించాలని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాదు.. కేంద్రం ప్రభుత్వ తరహాలో బడ్జెట్‌లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితి ప్రజలు గమనించి ఆలోచించాల్సిన అవసరం ఉందని.. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుందని హెచ్చరించారు.