గుడ్‌న్యూస్.. గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసే జీఓ జారీ చేసిన ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీచేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారిధి ఒక ప్రకటనలో తెలిపారు.
By Medi Samrat Published on 10 March 2025 9:21 PM IST
ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్దిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులను జారీచేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గృహా నిర్మాణ శాఖ జిఓ సోమవారం జారీ చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, బీసీ లబ్దిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్దిదారులకు రూ.75 వేలు మరియు పివిటీజీలకు రూ.1.00 లక్షల అదనపు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -1.0 మరియు పి.ఎం.జన్మన్ పథకాల క్రింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్దిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. దీని తోడు ఎస్.హెచ్.జీ. సభ్యులకు జీరో వడ్డీపై రూ.35 వేల వరకు ఋణ సౌకర్యాన్ని కల్పించడం కూడా జరుగుతుందన్నారు. ఇసుక కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఆ ఇసుక రవాణాకై రూ.15 వేల ను రవాణా చార్జీల క్రింద అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందజేసే యూనిట్ కాస్టు రూ.1.80 లక్షలకు అదనంగా ఈ అదనపు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
స్వర్ణ ఆంధ్ర విజన్ @ 2047లో భాగంగా 2029 నాటికి "అందరికీ ఇళ్లు" అనే లక్ష్య సాధనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేదలకు అందరికీ పక్కా గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ లక్ష్యాన్ని సకాలంలో సాదించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వ గృహా నిర్మాణ పథకాలను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు. పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-1.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -1.0 మరియు పి.ఎం.జన్మన్ తదితర పథకాల క్రింద మంజూరు చేసి మొత్తం గృహాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి 1.25 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను ఇంకా పూర్తి చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు వీటిలో 3.00 లక్షల గృహాలను ఈ ఏడాది జూన్ లోపు పూర్తి చేయనున్నామని, మిగిలిన గృహాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయనున్నామన్నారు.
అదే విధంగా పిఎమ్ఏవై (అర్బన్) బిఎల్సీ-2.0, పిఎమ్ఏవై (గ్రామీణ్) -2.0 మరియు పి.ఎం.జన్మన్ తదితర పథకాల క్రింద మరో 5.00 లక్షల గృహాలను రాష్ట్రంలో నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం క్రింద యూనిట్ కాస్టుగా రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అంజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకాల క్రింద లబ్దిదారులను గుర్తించే సర్వే కార్యక్రమం ప్రగతిలో నున్నదని, అర్హులైన లబ్దిదారులు అందరూ ఈ అవకాశాన్న సద్వినియోగం చేసుకోవానలి ఆయన విజ్ఞప్తి చేశారు.