కాసేపట్లో నింగిలోకి అత్యంత బరువైన శాటిలైట్..ఇస్రోకు మరింత గుర్తింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన భారీ ప్రయోగ వాహక నౌక LVM3 మరో కీలక వాణిజ్య మిషన్‌కు సిద్ధమైంది
By - Knakam Karthik |
కాసేపట్లో నింగిలోకి అత్యంత బరువైన శాటిలైట్..ఇస్రోకు మరింత గుర్తింపు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన భారీ ప్రయోగ వాహక నౌక LVM3 మరో కీలక వాణిజ్య మిషన్‌కు సిద్ధమైంది. LVM3-M6 / బ్లూబర్డ్ బ్లాక్–2 మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST SpaceMobile సంస్థ యొక్క బ్లూబర్డ్ బ్లాక్–2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇది LVM3 యొక్క 6వ ఆపరేషనల్ ఫ్లైట్ కావడం విశేషం. ఉదయం 8.54 గంటలకు బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
LVM3 మూడు దశల ప్రయోగ వాహక నౌక. ఇందులో.. రెండు ఘన ఇంధన స్ట్రాప్-ఆన్ మోటార్లు (S200), ద్రవ ఇంధన కోర్ దశ (L110), క్రయోజెనిక్ పై దశ (C25) ఉన్నాయి. ఈ వాహక నౌకకు 640 టన్నుల లిఫ్ట్-ఆఫ్ బరువు, 43.5 మీటర్ల ఎత్తు ఉండగా, జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO) కు 4,200 కిలోగ్రాముల పేలోడ్ మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఇప్పటివరకు LVM3, చంద్రయాన్–2, చంద్రయాన్–3, అలాగే వన్‌వెబ్‌కు చెందిన రెండు మిషన్లలో 72 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. ఇటీవలే నవంబర్ 2, 2025న నిర్వహించిన LVM3-M5 / CMS-03 మిషన్ కూడా సఫలమైంది.
ఈ తాజా LVM3-M6 మిషన్లో, బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో స్థాపించనున్నారు. ఇది LEOలో ప్రయోగించబడుతున్న అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, భారత గడ్డపై నుంచి LVM3 ద్వారా ప్రయోగించబడుతున్న అత్యంత బరువైన పేలోడ్గా కూడా రికార్డు సృష్టించనుంది. బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహాలు తదుపరి తరం కమ్యూనికేషన్ ఉపగ్రహాలుగా రూపొందించబడ్డాయి. ఇవి సాధారణ మొబైల్ స్మార్ట్‌ఫోన్లకే నేరుగా అంతరిక్ష ఆధారిత సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించే లక్ష్యంతో పనిచేయనున్నాయి. ఈ మిషన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో సామర్థ్యానికి మరింత గుర్తింపు లభించనుందని అంతరిక్ష నిపుణులు పేర్కొంటున్నారు.