రాష్ట్ర ప్రభుత్వానికి తనను ఇంకా సస్పెన్షన్ లో కొనసాగించే అధికారం లేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు లేఖ రాశారు. సస్పెన్షన్ కు 2022 ఫిబ్రవరి 8వ తేదీతో రెండేళ్లు నిండిన కారణంగా రూల్ ప్రకారం.. సస్పెన్షన్ ఆటోమేటిక్ గా తొలగి పోయినట్లే అని ఏబీ వేంకటేశ్వర రావు లేఖలో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం.. సస్పెన్షన్ తొలగినందున నా పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని కోరారు. నా సస్పెన్షన్ కు ఆరేసి నెలల వంతున ఇచ్చిన పొడిగింపు జనవరి 27 తోనే ముగిసిందని లేఖలో రాసుకొచ్చారు.
రెండేళ్లకు మించి సస్పెన్షన్ ను కొనసాగించాలంటే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పని సరి అని గుర్తుచేశారు. గడువులోగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోలేదు కాబట్టి.. సస్పెన్షన్ ముగిసినట్లేనని తెలిపారు. 31.7.2021 న చివరిసారిగా నా సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఇచ్చిన జీఓను రహస్యంగా ఉంచారని.. అందుకు సంబంధించిన కాపీ నాకు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఏమైనప్పటికీ... ఫిబ్రవరి 8వ తేదీతో నా సస్పెన్షన్ ముగిసినట్టేనని పేర్కొంటూ.. అందుకు సంబంధించి అన్ని వివరాలతో ఏబీ వేంకటేశ్వర రావు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు.