Interview : వచ్చే ఎన్నికల్లో వైసీపీది ఒంటరి పోరే : విజయసాయిరెడ్డి
Interview no truck bjp ysrcp fight polls alone Vijay Sai Reddy. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చే అవకాశాలపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 5 July 2023 9:48 PM ISTఏపీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతూ ఉందని గత కొద్దిరోజులుగా ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. అన్ని ఊహాగానాలకు తెరదించుతూ తాను పార్టీని వీడడం లేదని, పార్టీకి దూరం కావడం లేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీని జాతీయ స్థాయిలో నడిపించడమే కాకుండా రాష్ట్రంలోని 24 అనుబంధ విభాగాలకు ఆయన ఇంచార్జిగా ఉన్నారు. అన్ని అనుబంధ వింగ్‌లను యాక్టివేట్ చేయడమే కాకుండా.. రాబోయే కొన్ని నెలల పాటు ప్రచార ట్రయల్స్ కు కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
న్యూస్‌మీటర్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విజయ్ సాయి రెడ్డి ఆంధ్రా రాజకీయాలపైనా, కేంద్రంలో వైఎస్‌ఆర్‌సిపి, బీజేపీ మధ్య సంబంధాలపైనా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఆంధ్రా రాజకీయాలు
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విజయసాయి రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పొత్తు లేకుండా వైఎస్సార్‌సీపీ ఒంటరిగానే వెళ్తుందన్నారు. బీజేపీ-టిడిపి-జనసేన కలిసినా ఓడించడం కుదరదన్నారు. వైఎస్‌ఆర్‌సిపి మునుపటి ఓట్ల శాతం 49.5% కంటే ఇంకా మెరుగ్గా వస్తుందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల కోసం తమ అనుబంధ విభాగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జులై 23న కర్నూలులో లక్ష మంది ముస్లిం సంఘాల మద్దతుదారులతో మైనార్టీ సభను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆగస్టు 8న ఎస్టీ మహాసభలు జరగనున్నాయని.. ఆగస్టు చివరి నాటికి ఎస్సీ మహాసభ కూడా జరగనుందని చెప్పుకొచ్చారు.
టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి అడగ్గా.. వాస్తవాలకు దూరంగా చంద్రబాబు నాయుడు ‘మాయాఫెస్టో’ విడుదల చేశారని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడులా కాకుండా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ ఎన్నికల వాగ్దానాలలో 98% ఇప్పటికే నెరవేర్చిందన్నారు. ఎటువంటి తప్పుడు వాగ్దానాలు తాము చేయలేదని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా ఉంటుందని అన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాల విమర్శలపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలే తమ ప్రాధాన్యత అని అన్నారు. ప్రజలకు మంచి ఆహారం, దుస్తులు, విద్య, ఆరోగ్యం, ఉండడానికి ఇల్లు అవసరమన్నారు. ఈ అవసరాలన్నింటినీ వైఎస్‌ఆర్‌సీపీ తీరుస్తుందని చెప్పుకొచ్చారు. కులమతాలకు అతీతంగా ఈ అవసరాలను తీర్చడంపై తాము దృష్టి సారించామని ఆయన చెప్పారు.
కేసీఆర్ తృతీయ ఫ్రంట్
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చే అవకాశాలపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని ఈ విషయంలో బీఆర్‌ఎస్ సంప్రదించలేదని అన్నారు. వారు మమ్మల్ని సంప్రదిస్తే సీఎం జగన్ తమ వైఖరిని చెబుతారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రా మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య పలుమార్లు సమావేశాలు జరిగాయన్నారు. సమస్యల పరిష్కారం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీజేపీతో సంబంధాలు:
పోలవరం నిధులు విడుదల చేసినా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించినట్లేనని విజయసాయిరెడ్డి అన్నారు. కృతజ్ఞతగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర నాయకత్వాన్ని కలుస్తున్నారు, ఇతర పెండింగ్ సమస్యలపై మరింత మద్దతు కోరుతున్నారన్నారు.
కేంద్రంలో బీజేపీతో ఉన్న సంబంధాలపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీల వైపు మొగ్గు చూపడం వేరు.. పాలన వేరు. పాలనా పరంగా కేంద్ర స్థాయిలో బీజేపీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని మాత్రం ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, కేంద్రంలో ఉన్న బీజేపీతో కలిసి పనిచేస్తున్నాము తప్ప.. దీనికి భారతీయ జనతా పార్టీకి వైసీపీతో పొత్తు అని చెప్పలేమన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపణలపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు రాజకీయంలో భాగమని, వాస్తవానికి దూరంగా ఉన్నాయని అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసినప్పుడల్లా స్పెషల్ స్టేటస్ గురించి సీఎం జగన్ కూడా గుర్తు చేస్తున్నారన్నారు. అయితే టీడీపీ పొత్తుపెట్టుకున్న సమయం లో తీసుకున్న ప్యాకేజీని కేంద్రం ప్రస్తావిస్తోందన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి ఉందన్నారు.
వివాదాస్పద యూసీసీ, ఢిల్లీ అమెండ్మెంట్ బిల్లులపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ఈ బిల్లులపై బీజేపీ లేదా ఆప్ వైఎస్సార్‌సీపీని సంప్రదించలేదని అన్నారు. దీనిపై త్వరలోనే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.