పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా : సీఎం చంద్రబాబు

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అనేక రాయితీలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు

By Medi Samrat  Published on  28 Sept 2024 8:57 AM IST
పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా : సీఎం చంద్రబాబు

పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అనేక రాయితీలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. తుమ్మల పల్లి కళా క్షేత్రంలో శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఔత్సాహికులను చూస్తుంటే మళ్లీ ఈ రాష్ట్రంలో టూరిజంను బ్రతికిస్తామన్న నమ్మకం వస్తుందన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. టూరిజం కేవలం ఒక ప్రాంతాన్ని చూడటమే కాదు.. అది ఒక అన్వేషణ, ఒక మనశ్శాంతి ఒక ఉత్తేజం, ఒక అనుభవం అని అన్నారు. దైనందిన జీవితంలో మనిషి వత్తిడికి గురవుతున్నాడని, అందుకు పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నాడన్నారు. ఇందుకోసం భారతీయులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి విదేశాలకు వెళుతున్నారని, ఆయా దేశాలకు ఆదాయం తరలి పోతుందన్నారు. అదే మన దేశంలో పర్యాటక రంగానికి అనువైన పరిస్థితులు కల్పిస్తే ఆ ఆదాయం మనకే వస్తుందన్నారు. ఇంత వరకు సోషలిజం, కమ్యూనిజం తదితర వాటి గురించి మాట్లాడుకున్నాం, ప్రస్తుతం మనందరం టూరిజం గురించే మాట్లుకుంటామన్నారు. టూరిజం ద్వారా హోటళ్లు, ట్రావెల్స్ తదితర రంగాల్లో ఇతోధికంగా ఉపాధి కలుగుతుందని, వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగంగా టూరిజం నిలుస్తుందన్నారు. దేశంలో టూరిజం వల్ల జీడీపీలో 6.5 శాతం ఆదాయం వస్తుంటే, మన రాష్ట్రంలో 7.1 శాతం టూరిజం వలన ఆదాయం లభిస్తుందన్నారు.

ఒకప్పుడు టూరిజం బాగుండేది కాని ఐదేళ్లుగా కుంటుపడిందని, మరలా రాష్ట్రంలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకు వస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి ఏడాదికి 24 కోట్ల మంది మన రాష్ట్రానికి వస్తుంటే, విదేశీయులు 1.7 లక్షల మంది మాత్రమే వస్తున్నారన్నారు. 2014-2019 లో 20.6 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) ఉండగా గత ఐదేళ్లలో 3.3 శాతానికి పడిపోయిందన్నారు. అతిధి దేవోభవ అనేది మన తెలుగు వారి నానుడి అని టూరిజానికి ఆ సూక్తి చాలా అవసరమన్నారు. టూరిజంపై మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టూరిజంకు అనుకూలమైన విషయాలను అందంగా చెప్పగలగాలన్నారు. మన రాష్ట్రంలో అపార తీర ప్రాంతం, అపార సహజ వనరులు, నదులు, చరిత్ర, సంస్కృతి, ప్రాచీన ఆలయాలు, బౌద్ధ ఆరామాలు, 13 వన్య ప్రాణ అభయారణ్యాలు, మూడు జాతీయ పార్క్ లు ఇలా ఎన్నో విధాలుగా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు ఉన్నాయన్నారు.

హస్త కళలకు కొండపల్లి, కళంకారీ, లేపాక్షి తదితర సుసంపన్నమైన కళలకు మన రాష్ట్రం నిలయమన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో కొలువై ఉండటం మన అదృష్టమన్నారు. హిందూవులు జీవితంలో ఒక్కసారైనా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటారన్నారు. కాని ఇటీవల లడ్డూ విషయంలో కాంట్రావర్శీ అయిందని, ప్రతి మతంలో ఒక సాంప్రదాయం, పద్ధతులు ఉంటాయని, వాటిని మనందరం గౌరవించాలన్నారు. దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వకుండా పోవడం కూడా తప్పే అన్నారు. లడ్డు తయారీలో యానిమల్ ప్యాట్ ఉందని కూడా ల్యాబ్ లు తేల్చాయని, శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రత ను కాపాడటానికి నేను బాధ్యత తీసుకుంటానని హామీ ఇస్తున్నానన్నారు.. శ్రీశైలం మల్లన, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్న, అన్నవరం, అరసవెల్లి సూర్యదేవాలయం లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన రాష్ట్రంలోఉన్నాయన్నారు. పుట్టపర్తి సత్యసాయిబాబా వద్దకు నాలుగు రోజులు ఉందామని వెళ్లి టూరిస్టులు ఆరు నెలలు వరకు ఉండి మానసిక ప్రశాంతత పొందేవారన్నారు. ఇటీవల విజయవాడకు వరద ముంపు వస్తే నేను పది రోజులు ఇక్కడే ఉండి బురదలో సైతం దిగి బాధితులకు సాయం అందించానన్నారు. నాతో పాటు నాయకులు, అధికారులు, మంత్రులు కూడా సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి తీవ్రంగా కష్టపడ్డారన్నారు. ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించారన్నారు. మనస్సున్న ఎంతో మానవాతా మూర్తులు విరాళాల రూపంలో బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రపంచ స్థాయి పర్యాటకాన్ని ఆకర్షించే టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వంచర్ టూరిజం, వెల్ నెస్ టూరిజం, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ టూరిజం ఇలా అనేక విభిన్నరకాల టూరిజం ఎట్రాక్షన్ లపై దృష్టి సారించనున్నామన్నారు. అందమైన ప్రాంతాలైన అరకు, లంబసింగి, పాపికొండలు, దిండి, మారేడుమిల్లి, బొర్రా గుహలు, కంభాల కొండ, కోనసీమ లాంటి అందాలు మన రాష్ట్రంలో పెట్టుకుని మనం సరిగా మార్కెటింగ్ చేయగలిగితే టూరిజం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే బీచ్ టూరిజం అభివృద్ధి చేసి బీచ్ ఫెస్టివల్ లు ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుందన్నారు. అలాగే వాటర్ స్పోర్ట్స్, సీ ప్లేన్ లు కూడా ఏర్పాటు చేయనున్నామని, ప్రకాశం బ్యారేజీ వద్ద సీ ప్లేన్ దిగుతుందని, ఇక్కడి నుండే శ్రీశైలం తదితర ప్రాంతాలకు ట్రిప్ లు ఉంటాయన్నారు. సూర్యలంక, కాకినాడ, మచిలీపట్నం తదితర బీచ్ లలో బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామన్నారు. హార్స్ లీ హిల్స్, లేపాక్షి, గండికోట తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేయనున్నామన్నారు.

2014-19 మధ్య చేసుకున్న ఎంవోయూ లన్నీ నిలిచిపోయాయని, ఔత్సాహికులందరూ పారిపోతే, మళ్లీ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు పిలిచామని, 40 మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారన్నారు. పర్యాటక రంగానికి 2014-19 లో రూ. 2 వేల కోట్లు ఖర్చుపెడితే గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందన్నారు. రాష్ట్రంలో ఐకానిక్ గా గుర్తించిన ఐదు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నామని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అంతేకాకుండా నెల రోజుల్లో దీనికి సంబంధించి విధివిధానాలు పూర్తి చేస్తామన్నారు. ఇండస్ట్రీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ టూరిజానికి కూడా కల్పిస్తామన్నారు. రాత్రి 12 గంటల వరకు హోటళ్లు నిర్వహించుకునేలా ఆదేశాలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం కల్పించి టూరిజానికి పెద్దపీట వేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన అందమైన లోగిళ్లును అద్దెకిచ్చే పరిస్థితులు కల్పించి ఆదాయం వచ్చేలా, టూరిస్ట్ లకు ప్రయోజనం కలిగేలా చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రాజెక్ట్ లతో ముందుకు వస్తే ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తామన్నారు.

ఆదోనిలో రూ. 100 కోట్లతో నిర్మించిన విమలా రీజెన్సీని, చంద్రగిరి కోటలో రూ. 6 కోట్లతో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే అనకాపల్లి బొజ్జన కొండలో కూడా లైట్స్ అండ్ షోలను ఈ రోజు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ది ఏపీ టీడీసీ ఐఆర్సీటీసీ తో ఒప్పందం చేసుకుందన్నారు. టూరిస్ట్ లు ఎక్కువ మంది రావాలంటే మనలోనూ మార్పు రావాలి, మోసం చేసే ఆలోచన కనీసం దగ్గరకు కూడా రానివ్వకూడదు, మనింటికి గెస్ట్ వస్తే ఎలా ఆతిధ్యం ఇస్తామో, మన ప్రాంతానికి వచ్చే టూరిస్ట్ లను కూడా ఆదరించనప్పుడే మన పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. టూరిజం ద్వారా మొత్తం ఉపాధి కల్పనలో కనీసం 20 శాతం ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు

Next Story