Video : షాకింగ్‌.. తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 40 నిమిషాల పాటూ గాల్లో చక్కర్లు..!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా లోపం ఏర్పడింది.

By Medi Samrat
Published on : 21 July 2025 9:18 AM IST

Video : షాకింగ్‌.. తిరుపతి-హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 40 నిమిషాల పాటూ గాల్లో చక్కర్లు..!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా లోపం ఏర్పడింది. దీంతో తిరుపతి నుంచి టేకాఫ్ అయిన తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు విమానం ఆకాశంలో తిరుగుతూనే ఉండడంతో తిరుపతిలోనే విమానాన్ని అత్యవసరంగా దించారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో హైదరాబాద్ వైపు వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఈ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే 40 నిమిషాల తర్వాత విమానం తిరుపతిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్న‌ ఇండిగో ఎయిర్‌బస్ విమానం ఏ321నియో ఆదివారం సాయంత్రం 7:42 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఎయిర్ ట్రాఫిక్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత రాత్రి 8:34 గంటలకు తిరుపతి విమానాశ్రయంలో మళ్లీ ల్యాండ్ అయింది.

ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. విమానం తిరుపతిలోని వెంకటనగరికి చేరుకుంది. ఆపై అక్కడ నుండి యు-టర్న్ తీసుకుంది. దీని తరువాత, విమానం 40 నిమిషాల పాటు గాలిలో తిరుగుతూనే ఉంది, ఆపై విమానం తిరుపతి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది.

అయితే ఇండిగో వెబ్‌సైట్ ప్రకారం.. తిరుపతి నుంచి రాత్రి 7:20 గంటలకు బయలుదేరిన విమానం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. అదే సమయంలో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన చివరి విమానాన్ని రద్దు చేశారు.


విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలా వరకు వచ్చాయి. విమానానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇండిగో ఇంకా వెల్ల‌డించ‌లేదు.


Next Story