గ్రీన్ హైడ్రోజన్ నౌకల దిశగా భారత్ తొలి అడుగు
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించే నౌకలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ వెల్లడించారు.
By Medi Samrat
గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధిలో దేశం ముందడుగు వేసింది. పర్యావరణానికి అనుకూలంగా, నావిక రవాణా రంగాన్ని నూతన దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో హైడ్రోజన్ ఇంధనాన్ని వినియోగించే నౌకలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ వెల్లడించారు.
లోక్ సభలో శుక్రవారం గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధి పై కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వ శాఖను ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నించగా.. ఆ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
స్వదేశీ సాంకేతిక పరిజ్జానంతో పూర్తిగా హైడ్రోజన్ ఇంధన కణాలతో నడిచే విధంగా కోచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ , మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ సంస్థలు చెరో ఒక నౌకను నిర్మిస్తున్నాయని కేంద్ర మంత్రి సర్భానంద సోనోవాల్ తెలిపారు.
ఈ ప్రయత్నాలను మరింత వేగవంతం చేయడానికై కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద 2025–26 వరకు రూ.115 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందన్నారు.. ఈ నిధులను నౌకల రూపకల్పన, సాంకేతిక పరీక్షలు, ప్రయోగాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగిస్తారని పేర్కొన్నారు.
హైడ్రోజన్ ఆధారిత నౌకల అభివృద్ధి రెండు దశలుగా జరుగుతోందని, ఒకదశలో ఇప్పటికే ఉన్న నౌకలను గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచేలా మారుస్తారని, మరోదశలో ముఖ్యమైన నౌకాశ్రయాలలో హైడ్రోజన్ ఇంధనం నింపే సదుపాయాలను అభివృద్ధి చేస్తారని తెలియపర్చారు. ఇందుకోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వి.ఓ.చిదంబరనార్ పోర్ట్ అథారిటీ వంటి సంస్థలను అమలు సంస్థలుగా నియమించారు.
VOCPA ఇప్పటికే 750 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో అదేవిధంగా దీన్‌దయాళ్ పోర్ట్, పరాదీప్ పోర్ట్ మరియు తూతుకుడి పోర్ట్ లను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేసే ప్రణాళికను కేంద్రం రూపొందించింది.
ఈ ప్రాజెక్టుల కోసం తూతుకుడిలోని వి.ఓ.చిదంబరనార్ పోర్ట్ లో 750 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో గ్రీన్ మెథనాల్ బంకరింగ్ సదుపాయాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసిందని, దీన్‌దయాళ్ పోర్ట్, తూతుకుడి పోర్ట్, పరాదీప్ పోర్ట్ లను హైడ్రోజన్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ డెవలప్మెంట్ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఈ నౌకాశ్రయాలను ఉత్పత్తి , ఎగుమతుల కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారని తెలిపారు.
ఈ చర్యలు దేశంలో మళ్లీ మళ్లీ ఉపయోగించగల ఇంధనాలను ఎక్కువగా వాడేలా చేస్తాయని, సముద్ర మార్గాల్లో పొగలు, ధూళి వంటి కాలుష్యాన్ని తగ్గిస్తాయన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలో భారత్ ముందు వరుసలో నిలవడానికి సహాయపడతాయని. కేంద్రం తీసుకుంటున్న ఈ పరిణామాత్మక నిర్ణయాలు భవిష్యత్ నౌకాయాన రంగానికి కొత్త వెలుగు నింపుతున్నాయని కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయాన, జలమార్గాల మంత్రి సర్భానంద సోనోవాల్ స్పష్టం చేశారు.