గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. విశాఖ మన్యంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో.. స్థానిక ప్రజలు చలికి గజ గజ వణుకుతున్నారు. చింతపల్లి, లంబసింగి, పాడేరు, అరకులో గడ్డ కట్టే చలిగాలులు వీస్తున్నాయి. అయితే రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. గడ్డకట్టే చలితో విశాఖ మన్యం.. కశ్మీర్‌ను తలపిస్తోంది. మన్యానికి క్రమక్రమంగా పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది.
విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లిలో అత్యత్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రత పెరుగుదలతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. సాధారణం కంటే సగటున 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుండి 22 డిగ్రీల వరకు నమోదు అవుతాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్‌లో శనివారం అత్యంత చలిరోజుగా రికార్డ్ నమోదు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అత్యల్పంగా 8.2 డిగ్రీలు, పటాన్‌చెరులో 8.4, రాజేంద్రనగర్‌లో 9.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.5 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డయినట్టు అధికారులు పేర్కొన్నారు.