మొదలైన స్కూల్స్.. పలు జాగ్రత్తలు
In Andhra Pradesh Schools Starts From Today. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా సెకండ్ వేవ్ మందగించడంతో పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహించనున్నారు. తరగతుల నిర్వహణపై ఇప్పటికే విద్యాశాఖ పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతి గదికి 20 మంది విద్యార్థులు మించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్‌కి ఎస్‌వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ సమూలంగా మారిపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. కరోనా రెండవ వేవ్ ఉధృతి దృష్ట్యా ఇప్పటివరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తుండగా సోమవారం నుంచి 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అందరికీ ఆఫ్‌లైన్‌లో ప్రత్యక్షంగా పాఠాలు బోధించనున్నారు.
ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. విద్యార్థులందరికీ తప్పనిసరిగా మధ్యాహ్న భోజనం పెట్టాలి. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మొత్తం అందరూ ప్రతిరోజు పాఠశాల విధులకు హాజరుకావాల్సిందేనని ఉన్నతాధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య పరిరక్షణ కోసం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. కోవిడ్ లక్షణాలున్న వారికోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించారు. ఇళ్లలో వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు స్కూలుకు రాకుండా ఇళ్ల వద్దనే ఉండేలా సూచించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.